తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలనే మోస్తూ వస్తోంది అని తమ్ముళ్ళు గరం గరం అవుతున్నారు. ప్రతీసారి ఎన్నికల్లో ఇచ్చిన వారికే టికెట్లు ఇచ్చుకుంటూ పోతున్నారని దీని వల్ల కొత్త వారికి ఎపుడు చాన్స్ దొరుకుతుంది అని తమ్ముళ్ళు ఆక్రోశిస్తున్నారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన గణబాబుకు టీడీపీ మరోసారి టికెట్ ఇచ్చింది. ఆయనకు 1999 నుంచి పార్టీ టికెట్ ఇస్తూనే వస్తోంది. మధ్యలో 2009లో ఆయన ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. టీడీపీ లెక్క చూస్తే దీంతో ఐదవసారి టికెట్ ఇచ్చినట్లు అని అంటున్నారు.
ఆయన కంటే ముందు ఆయన కుటుంబానికి కూడా పార్టీ వరస టికెట్లు ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. దీని మీద గరం గరం అవుతూ పార్టీ సీనియర్ నేత పాశర్ల ప్రసాద్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఒకే కుటుంబానికి టికెట్లు ఇస్తే మాకేంటి అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పాశర్ల ఈసారి పశ్చిమ టికెట్ ఆశించారు. అక్కడ కాపులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఆయన గుర్తు చేస్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం తీసుకుంటే వెలగపూడి రామక్రిష్ణబాబుకే టికెట్ దక్కింది. ఆయనకు ఇది నాలుగవసారి. విశాఖ తూర్పులో ఈసారి మార్పు ఉంటుందని భావించినా వెలగపూడినే పార్టీ ఎంపిక చేసింది.
బీసీల సీటు అయిన తూర్పులో ఓసీకే ప్రతీసారీ టికెట్ ఇస్తున్నారని, అది కూడా ఒకరికే ఇస్తున్నారు అని తమ్ముళ్ళు మండుతున్నారు. బీసీలకు టికెట్ ఇవ్వలేరా అని మండిపడుతున్నారు. వెలగపూడి మీద ఈసారి యాంటీ ఇంకెంబెన్సీ ఉందని అయినా తెలిసి టికెట్ ఎలా ఇచ్చారని విమర్శిస్తున్నారు.
ఇదే విధంగా ఆముదాలవలసలో కూన రవికుమార్ కి నాలుగవసారి టికెట్ ని ఇస్తున్నారు. పాతపట్నం అంటే కలమట కుంటుబానికే అని రాసిచ్చేశారు అని అంటున్నారు. అనేక ఎన్నికల నుంచి వారికే టికెట్ ఇస్తున్నారు అని ప్రత్యర్ధి వర్గం అంటోంది. ఇలా ఇచ్చిన వారికే టికెట్లు ఇచ్చుకుంటూ పోతే కొత్త ముఖాలు యువతకు చోటు ఎక్కడ అని టీడీపీని తమ్ముళ్ళు నిలదీస్తున్నారు.