మీ భూమి సేవ‌ల‌కు తీవ్ర అంత‌రాయం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భూముల‌కు సంబంధించిన వివ‌రాలు చూసుకునేందుకు నిర్వ‌హించే మీ భూమి వెబ్‌సైట్ అస‌లు తెరుచుకోనంటోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భూముల‌కు సంబంధించిన వివ‌రాలు చూసుకునేందుకు నిర్వ‌హించే మీ భూమి వెబ్‌సైట్ అస‌లు తెరుచుకోనంటోంది. దీంతో రైతాంగం, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు, వివ‌రాలు చూసుకోవాల‌నుకునే ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారు. ఒక‌ట్రెండు రోజులు స‌మ‌స్య త‌లెత్తిందంటే అర్థం చేసుకోవ‌చ్చు. కానీ మీ భూమి వెబ్‌సైట్ కొన్ని రోజులుగా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో వివిధ ర‌కాల వినియోగ‌దారులు అల్లాడుతున్నారు.

అస‌లు ఆ వెబ్‌సైట్ ఎందుకు ప‌ని చేయ‌డం లేదో రెవెన్యూశాఖ ప్ర‌జ‌ల‌కు స‌మాచారం ఇవ్వాల‌న్న బాధ్య‌త‌ను కూడా విస్మ‌రించ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదేనా ప్ర‌భుత్వ జ‌వాబుదారీత‌నం అని నిల‌దీస్తున్నారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో ఏవో సంస్క‌ర‌ణ‌లు అంటూ కొంత కాలం ఇబ్బంది పెట్టారు. ఆ త‌ర్వాత కొన్ని ర‌కాల భూముల్ని ఫ్రీహోల్డ్‌లో పెట్టి, స‌తాయిస్తున్నార‌ని రైతులు విమ‌ర్శిస్తున్నారు. ఇప్ప‌టికే ఒక ద‌ఫా మూడు నెల‌లు ఫ్రీహోల్డ్‌లో పెట్టార‌ని, ఆ త‌ర్వాత మ‌రో రెండునెల‌లు కొన‌సాగిస్తూ రెవెన్యూ శాఖ రైతుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌న్న బ‌ల‌మైన విమ‌ర్శ వుంది. దీంతో ప్ర‌భుత్వంపై రైతులు మండిప‌డుతున్నారు.

మీ భూమిని ఇప్ప‌టికైనా ప‌ని చేసేలా రెవెన్యూశాఖ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌నం కోరుతున్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండా, బ్లాక్ చేయ‌డం స‌రైన విధానం కాద‌నే విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది.

6 Replies to “మీ భూమి సేవ‌ల‌కు తీవ్ర అంత‌రాయం”

Comments are closed.