ఆయన టీడీపీ ఫైర్ బ్రాండ్. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఆయన నోరు విప్పితే నిప్పులే కురిపిస్తారు. అలాంటి అయ్యన్నపాత్రుడుతో ఢీ అంటే ఢీ అంటున్నారు నర్శీపట్నం వైసీపీ ఎమ్మెల్యే గణేష్. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉమా శంకర్ గణేష్ పర్యటనలు చేస్తూంటే ఒక చోట టీడీపీ వారు అడ్డుకుని వివాదాన్ని రాజేయబోయారు.
అంతే ఎమ్మెల్యే గణేష్ ఒక లెక్కన ఫైర్ అయ్యారు. మీరు కాదు అయ్యన్నపాత్రుడు వచ్చినా నేను ఆగేది లేదు, బెదిరేది లేదు అంటూ బస్తీ మే సవాల్ చేశారు. రౌడీయిజానికి వైసీపీ ఏలుబడిలో నో చాన్స్ అంటూ తమ్ముళ్ళకు స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు.
మీరే వస్తారో మీ నాయకుడు అయ్యనే వస్తారో తేల్చుకుందామని కూడా పూరీ మార్క్ డైలాగులు చెప్పారు. పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ సంక్షేమ పధకాలను తమ ప్రభుత్వం అందచేస్తూంటే అయ్యన్నపాత్రుడు ఓర్వలేకపోతున్నారు అని మండిపడ్డారు. తన పర్యటనను అడ్దుకోవాలని చూస్తే సహించేది లేదని కూడా హెచ్చరించారు.
అయ్యన్నపాత్రుడు వర్సెస్ గణేష్ అన్నది నర్శీపట్నంలో సాగుతున్న పొలిటికల్ సినిమా. ఇంతకీ ఈ ఎమ్మెల్యే గణేష్ ఎవరో కాదు టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ సోదరుడు. దాంతో పూరీ సినిమా మాదిరిగా అక్కడ పొలిటికల్ వార్ ఒక రేంజిలో నడుస్తోందిపుడు.