వైసీపీలో ఇద్దరు ఫైర్బ్రాండ్లు… వాళ్లిద్దరికి ఒకే మండల ఎన్నిక బాధ్యతలు అప్పగించడం విశేషం. ఇద్దరినీ వేర్వేరు మండలాలకు కేటాయించి వుంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో భారీ మెజార్టీ సాధించాలని వైసీపీ పట్టుదలతో ఉంది. ఈ సందర్భంగా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సిద్ధాంతంతో ఆ పార్టీ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకుంది.
ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు ఒక మంత్రి, అలాగే మరో ఎమ్మెల్యేకు ఇన్చార్జ్ బాధ్యతల్ని అప్పగించింది. ఈ నేపథ్యంలో చేజర్ల మండలానికి మంత్రి ఆర్కే రోజా, అలాగే మాజీ మంత్రి కొడాలి నానికి బాధ్యతలు అప్పగించడం గమనార్హం. వైసీపీలో ఇద్దరూ ఇద్దరే. ప్రత్యర్థులపై రాజకీయంగా విమర్శలు చేయడంలో వాళ్లిద్దరికి ప్రత్యేకత వుంది.
వీళ్లిద్దరి విమర్శల్లో వాడి, వేడి వుంటుంది. ఎదుటి వాళ్లకు గుచ్చుకునేలా సెటైర్స్తో విరుచుకుపడుతుంటారు. అలాంటి ఇద్దరు నేతలను ఒకే మండలానికి కేటాయించడం వల్ల, మిగిలిన ఐదు మండలాల్లో ఎన్నికల ప్రచారం చప్పగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ శ్రేణుల్లో ఈ ఇద్దరి నాయకులకు ప్రత్యేకంగా అభిమానులున్నారు. రోజా, కొడాలి నాని విమర్శలపై ప్రత్యర్థులు ఎంతగా విమర్శలు చేసినా, సొంత పార్టీలో మాత్రం క్రేజీ ఉందన్నది వాస్తవం. అందుకే ఇద్దరినీ ఒకే మండలానికి కాకుండా, వేర్వేరుగా నియమించి వుంటే, ఆ కిక్కే వేరుగా ఉండేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.