నిత్యం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కంపెనీ దివాలా తీసిందనే వార్త గుప్పుమంది. దివాలాకు దారి తీసిన వైనం గురించి తెలిస్తే… ఔరా అనిపించకమానదు. రూ.71 లక్షల వరిపొట్టు సొమ్ము చెల్లించకపోవడంతో దివాలాకు దారి తీసింది. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం దివాలా తీసే ప్రమాదం వుందని నీతులు చెప్పే ఎంపీగారికి, తన కంపెనీ దివాలా గురించి ఏమంటారో మరి.
రఘురామకృష్ణరాజుకు మహారాష్ట్రలో ఇంద్ భారత్ ఎనర్జీ (మహారాష్ట్ర) కంపెనీ వుంది. ఈ కంపెనీకి కొల్హాపూర్‌కు చెందిన రంగారావు బాబూరావు గైక్వాడ్ వరిపొట్టు సరఫరా చేశారు. ఇందుకు సంబంధించి రూ.56.55 లక్షలు అసలు మొత్తాన్ని రఘురామ కంపెనీ చెల్లించాలి. అయితే ఎన్నిసార్లు అడిగినా పలకకపోవడంతో పొట్టు సరఫరా చేసిన వారికి చిర్రెత్తుకొచ్చింది. వడ్డీతో సహా రూ.71.01 లక్షలు చెల్లించాల్సి వుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని రంగారావు బాబూరావు గైక్వాడ్ ఆశ్రయించారు. ఇంద్ భారత్ ఎనర్జీ (మహారాష్ట్ర) కంపెనీ దివాలా ప్రక్రియకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు. దివాలాకు ఎన్‌సీఎల్‌టీ అనుమతి ఇచ్చింది. దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇంద్ భారత్ ఎనర్జీ కంపెనీ దాఖలు చేసిన పలు మధ్యంతర పిటిషన్లను ఎన్‌సీఎల్‌టీ సభ్యులు బీఎన్ వెంకటరామకృష్ణ, ఎ.వీరబ్రహ్మారావులతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
సొంతింటిని చక్కదిద్దుకోకుండా ఊరిని ఉద్ధరిద్దామని బయల్దేరిన ఎంపీ గారి కంపెనీ దివాలా తీయడం హాట్ టాపిక్‌గా మారింది.