విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రోజు సంక్షోభం అంచున ఉంది. దాని పీక మెల్లగా నొక్కుతూ కధ క్లైమాక్స్ కి చేర్చే పనిని కేంద్ర పెద్దలు వేగవంతం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రి ఒకనాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వచ్చారు.
ఆయన విశాఖలో మేధావుల సదస్సులో మాట్లాడుతూ విశాఖను డ్రగ్స్ కాపిటల్ చేశారు అని వైసీపీ సర్కార్ మీద విమర్శించారు. వైసీపీ ఏలుబడిలో అక్రమాలు అవినీతి పెరిగిపోయాయని ఖజానా అప్పుల కుప్ప అయిందని పోలవరం పూర్తి కాలేదని ఇలా చాలా విమర్శలే చేశారు.
ఇవన్నీ కూటమి పెద్దలకు ఆనందం కలిగించేవే. అయితే విశాఖ వంటి మహా నగరానికి ఉక్కు లాంటి కర్మాగారం ఒకటి ఉందని అది ప్రైవేటు కబంధ హస్తాలలో పడి నలిగిపోతోంది అని రాజ్‌నాథ్ సింగ్ కి బహుశా తెలియదు అనుకోగలమా.
ఆయన కేంద్ర మంత్రివర్గంలో అతి ముఖ్యుడు. ఆ విషయం మాట్లాడకుండా విశాఖ ఏదో అయిపోతోందని ఆయన విమర్శలు చేయడం పట్ల అంతా ఫైర్ అవుతున్నారు. రాజ్‌నాథ్ సింగ్ వచ్చిన సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కి తరలించారు.
ఉక్కు మీద జవాబు చెప్పలేక ఇలా మమ్మల్ని అక్రమంగా నిర్బంధిస్తారా అని ఉక్కు ఉద్యమకారులు కేంద్ర మంత్రి మీద మండిపోతున్నారు. విశాఖ ఉక్కు అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటూంటే దాని మీద మాట్లాడకుండా కేంద్ర మంత్రి విశాఖకు ఏపీకి ఏదో చేశామని చెప్పుకోవడం ఏమిటని ఫైర్ అవుతున్నారు. కూటమికి ఖుషీ చేయడానికే రాజ్‌నాథ్ సింగ్ వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నపుడే 2014లో బీజేపీ టీడీపీ పొత్తు ఖరారు అయిన సంగతిని గుర్తు చేస్తున్నారు.