‘అయ్యకు విద్య లేదు.. అమ్మకు గర్వం లేదు..’ అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఈ సామెతకు అర్థం విడమరచి చెప్పడం కష్టం గానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమరాంగణంలో తెలుగుదేశం- భాజపా పార్టీల పరిస్థితి మాదిరిగా- అని చెబితే చాలు.. సామెత కూడా అర్థమైపోతుంది. తెలుగుదేశం పార్టీకి ఆయనను బుజ్జగించేంత దమ్ములేదు. భారతీయ జనతా పార్టీకి ఆయనను మించిన అభ్యర్థికి గతి లేదు. దొందూ దొందే అన్నట్టుగా, వేరే గతిలేని ఈ పార్టీలు కలసి పండగ చేసుకుంటున్నాయి.
అనపర్తి ఎమ్మెల్యే సీటు విషయంలో ఇలాంటి కామెడీ చోటు చేసుకుంటోంది. అక్కడ పార్టీని కాపాడుతూ వచ్చిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబునాయుడు చాలాకాలం కిందటే అభ్యర్థిత్వం ప్రకటించేశారు. ఆయన అప్పటి నుంచి ముమ్మరంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. తీరా పొత్తులు డిసైడయ్యాక, ఆ సీటును భాజపాకు కట్టబెట్టేశారు.
భాజపాకేమో అక్కడ నామమాత్రపు బలం కూడా లేదు. పొత్తుల్లో వచ్చింది కదాని.. ఓ అభ్యర్థిని ప్రకటించారు. ఈలోగా నల్లమిల్లి రామక్రిష్ణారెడ్ది తాను తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో ఉండి తీరుతానని ప్రకటించారు. ఆయనకు సర్దిచెప్పి.. కూటమి పార్టీకి సహకరించాలని ఒప్పించగల దమ్ము తెలుగుదేశం పార్టీ అధినేతకు లేదు. నల్లమిల్లి కాదని తమ సొంత అభ్యర్థిని గెలిపించుకోగల దమ్ము భారతీయ జనతా పార్టీకి లేదు.
ఇలాంటి నేపథ్యంలో మళ్లీ చంద్రబాబు నాయుడు కుటిల వ్యూహమే అమలులోకి వచ్చింది. ఏ విధంగా అయితే.. జనసేన పార్టీకి సొంత బలం లేని సీట్లను కట్టబెట్టి.. ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం నాయకులనే జనసేనలోకి పంపి, వారికి టికెట్లు దక్కేలాగా ఒక కుటిల రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు నడిపారో.. అదే అనపర్తి విషయంలో కూడా అమలు చేశారు.
నల్లమిల్లిని భాజపాలోకి పంపారు. ఇప్పుడు భాజపా ఆయనకు టికెట్ కేటాయించింది. అంతా సద్దుమణిగిపోయింది. కానీ, స్థూలంగా గమనించినప్పుడు.. కూటమిలోని అన్ని పార్టీల తరఫున కూడా తెలుగుదేశం నాయకులు మాత్రమే పోటీచేస్తున్నారని మనకు అర్థమవుతుంది. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. కూటమి పార్టీల్లో విభేదాలు వస్తే.. తన పార్టీ వారిని ఫిరాయింపజేసి తెలుగుదేశంలో కలుపుకోకుండా చంద్రబాబునాయుడు ఉంటారా? అనేది ప్రశ్న.
ఏరు దాటాక బోడిమల్లన్న అనగల తెలివి తేటలు పుష్కలంగా ఉన్న చంద్రబాబు గురించి భాజపా, జనసేన జాగ్రత్త పడాలని ప్రజలు అనుకుంటున్నారు.