మడత పేచీ రాజకీయాలే తప్ప.. స్ట్రెయిట్ విమర్శలు, స్ట్రెయిట్ వ్యవహారాలు మన రాజకీయ నాయకుల్లో మచ్చుకు కూడా కనిపించవు. ఒక పాయింటు పట్టుకుని జీడిపాకం లాగా సాగదీసుకుంటూ విమర్శలు చేసుకుంటూ ఉండడమే తప్ప.. ప్రభుత్వాన్ని నిర్దిష్టంగా విమర్శించాలని, దారితప్పుతోంటే గైడ్ చేయాలనే ప్రయత్నం ప్రతిపక్షంలో కనిపించదు.
భారత రాష్ట్ర సమితి నాయకులు ఇదే మాదిరి లోతు లేని విమర్శలతోనే అభాసు పాలవుతున్నారు. హరీష్ మాటలను గమనిస్తే.. జీడిపాకం తరహాలో, డైలీ సీరియల్ కు స్క్రిప్టు రచయితగా ఆయన రాణిస్తారేమో అనిపిస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రైతురుణ మాఫీ చేస్తాం అని రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. గెలిచిన తర్వాత.. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని హామీలను ఒక్కటొక్కటిగా కార్యరూపంలోకి తెస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితప్రయాణం కావొచ్చు.. 200 యూనిట్లు దాటని వారికి ఉచిత విద్యుత్తు కావొచ్చు.. ఇలా రకరకాల పథకాలు ఆల్రెడీ అమల్లోకి వచ్చాయి.
రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది ఇంకా కార్యరూపంలోకి రాలేదు. ఈ అంశంపై విమర్శ చేయడానికి, ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని నింద వేయడానికి ప్రతిపక్షానికి హక్కుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలను మోసం చేసిందంటూ అందరు భారాస నాయకుల్లాగే హరీష్ రావు కూడా విమర్శించారు.
ఈ అందరి విమర్శలకు రేవంత్ రెడ్డి జవాబు ఇస్తూ.. రుణ మాఫీ అమలు చేసేలోగా ఎన్నికల కోడ్ వచ్చిందని, ఎన్నికల ముగిసిన తర్వాత.. ఆగస్టు 15 లోగా రుణ మాఫీ పూర్తి చేస్తాం అని సెలవిచ్చారు.
నిజానికి జూన్ 4 నాటికి ఎన్నికల పర్వం మొత్తం ముగిసిపోతుండగా.. పాత హామీని అమలు చేయడానికి కోడ్ నెపం పెట్టి ఆగస్టు 15 దాకా రేవంత్ ఎందుకు టైం అడిగారనేది అర్థంకాని ప్రశ్న. ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రశ్నించి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. ఆగస్టు 15లోగా అమలు చేయకపోతే రాజీనామా చేస్తావా అని రేవంత్ ను నిలదీశారు. ఆయన దానికి జవాబిస్తూ అమలుచేస్తే హరీష్, కేసీఆర్, కేటీఆర్ రాజీనామాచేస్తారా? అని సవాలు విసిరారు.
ఇంతవరకు ఒక రకంగా ఉంది. ఈ సవాలును హరీష్ రావు స్వీకరించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని, మళ్లీ ఉప ఎన్నికలో కూడా నిలబడను అని హరీష్ రావు చెప్పుకొచ్చారు. అయితే.. సవాళ్లను తెగనివ్వకుండా జీడిపాకంలాగా సాగదీయడం అలవాటు అయిన ఆయన.. దానికి కూడా ఒక మడత పేచీ పెట్టారు. ముందు రేవంత్ వచ్చి అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయాలట. ఆయన కూడా వచ్చి ప్రమాణం చేస్తాడట. ఈ పితలాటకం ఏంటో అర్థం కాని సంగతి.
ఆగస్టు 15లోగా అమలు చేయడం గురించి రాజీనామాలు చేస్తామని ఇరువురూ సవాళ్లు విసురుకోవడం అయింది. మళ్లీ ప్రమాణాలు ఎందుకు? ఇక్కడితో సవాళ్లకు ఫుల్ స్టాప్ పెట్టేసి.. ఆగస్టు 15లోగా అమలు చేస్తే.. హరీష్ రాజీనామా చేసేసి.. ఈ ఒత్తిడులు లేని ప్రశాంత జీవితం గడపొచ్చు. అమలు చేయకపోతే.. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిందే అని గల్లా పట్టుకుని నిలదీయవచ్చు. అంతే తప్ప.. ఇలాంటి శుష్కమైన ప్రమాణాల ప్రహసనం ఎందుకు అని ప్రజలు విస్తుపోతున్నారు.