ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే చాలా మంది నాయకులకు కోపం. కానీ ప్రజల్లో జగన్‌పై ఆదరణ ఉంది. జగన్ పాలనా విధానాలు గ్రామ, పట్టణ, నగరాల్లో నాయకత్వాన్ని బలహీనపరిచేలా వుంది. నాయకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించేలా జగన్ విధానాలున్నాయి.
జగన్ సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళుతోంది. అయితే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, తమకు విలువ లేకుండా చేశారనే ఆవేదన వైసీపీ నేతల్లో వుంది. అధికారంలో వుండి కూడా ప్రజల్లో పరపతి సంపాదించుకోలేకపోయామని ఆవేదన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. ఇక ప్రతిపక్ష నేతల మనసులో జగన్‌పై ఎలాంటి అభిప్రాయం వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ టీడీపీ, జనసేన పార్టీలను బలహీనపరిచే ప్రయత్నాలు జరిగాయి. కొన్ని చోట్లు పోలీసుల్ని అడ్డు పెట్టుకుని కేసులతో భయకంపితుల్ని చేశారనే విమర్శ లేకపోలేదు. నోరెత్తితే కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారని ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌ను ఎంత తిడితే ఆయనకు అంత ఆశీర్వాదం అందించినట్టన్నారు. గతంలో కంటే ఈ దఫా తమ పార్టీ మరిన్ని ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులున్నారా? అని ఆయన ప్రశ్నించారు. పనికి రారని తీసేసినోళ్లను చంద్రబాబు చేర్చుకుంటున్నారని దెప్పి పొడిచారు. ఏ రకంగా చూసినా సీఎం వైఎస్ జగన్‌కు చంద్రబాబు దీటైన నాయకుడు కాదని ఆయన అన్నారు.