ఐదేళ్ల పరిపాలనలో టీడీపీ చేయకూడని తప్పులన్నీ చేసింది. ప్రతిపక్షంలోకి రాగానే జ్ఞానోదయం అయ్యింది. ఇప్పుడూ మమ్మల్నే తిడుతారా? ఇదేం న్యాయమని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు ప్రశ్నిస్తుండడం గమనార్హం. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీని తప్పు పట్టారు. రామ్మోహన్నాయుడి విమర్శలు మొగున్ని కొట్టి మొగసాలకు ఎక్కిన చందంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నప్పుడు కూడా చంద్రబాబు స్మరణే చేశారని విమర్శించారు. అక్కడ కూడా ఆయన ఊసెందుకని రామ్మోహన్నాయుడు ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీ వచ్చి మరీ చంద్రబాబును తిట్టారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చి చంద్రబాబును తిట్టాల్సిన అవసరం ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా గురించి బుగ్గన ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. అలాగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒక్క వైసీపీ ఎంపీ అయినా అడిగారా? అని రామ్మోహన్నాయుడు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్ ప్రతిరోజూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడాన్ని రామ్మోహన్నాయుడు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ప్రత్యేక హోదా గురించి అడిగిన పాపాన పోలేదని విమర్శించారు.
అయితే ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిందే టీడీపీ ప్రభుత్వమని రామ్మోహన్నాయుడు విస్మరించినట్టున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రత్యేక హోదా గురించి జగన్‌ను విమర్శించే నైతిక హక్కు టీడీపీ నేతలెవరికీ లేదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేక హోదా గురించి జగన్ ఎప్పుడూ అడుగుతూనే వున్నారని, అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడాన్ని సాకుగా చూపుతోందని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.
ఏది ఏమైనా ప్రత్యేక హోదాను స్వప్రయోజనాల కోసం తాకట్టు పెట్టి, ఇప్పుడు తమను నిలదీయడం అంటే మొగున్ని కొట్టి మొగసాలకు ఎక్కిన చందంగా ఉందని వైసీపీ నేతలు సెటైర్స్ విసురుతున్నారు.