ఈమధ్య కాలంలో బాగా హిట్టయిన సాంగ్ గుంటూరుకారంలోని 'కుర్చీ మడతపెట్టి' అనే పాట. త్రివిక్రమ్ లాంటి దర్శకుడి సినిమాలో ఇలాంటి సాహిత్యం ఏంటంటూ చాలా విమర్శలొచ్చినప్పటికీ పాట మాత్రం హిట్. అందులో మహేష్-శ్రీలీలలో పాటు పూర్ణ కూడా కనిపించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడిదే అంశంపై కొత్త పుకారు మొదలైంది. గుంటూరుకారంలోని ఆ పాట కోసం ముందుగా రష్మిని అనుకున్నారట. ఆమె తిరస్కరించడంతో పూర్ణను తీసుకున్నారనేది ఆ ప్రచారం.
మహేష్ బాబు సినిమాలో ఆఫర్ ను తిరస్కరిస్తావా అంటూ అప్పుడే రష్మిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ కూడా మొదలైంది. దీంతో ఈ యాంకర్ వెంటనే స్పందించింది. తనపై వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిపింది.
“ఈ వార్త పూర్తిగా నిరాధారమైంది. ఆ పాట కోసం నన్ను ఎవ్వరూ సంప్రదించలేదు, అలాంటప్పుడు నేనెలా తిరస్కరిస్తాను. పైగా ఆ పాటలో పూర్ణ చాలా బాగా చేశారు. వేరే ఎవ్వరూ అంతకంటే బాగా చేయలేరు.”
ఇలా తనపై వచ్చిన పుకారుపై స్పష్టత ఇచ్చింది రష్మి. ఇలాంటి ఫేక్ న్యూస్ లు తనపై లేనిపోని నెగెటివిటీని సృష్టిస్తాయని… దయచేసి ఇలాంటి అవాస్తవాల్ని ప్రోత్సహించొద్దని కోరింది.