రాయపాటి శైలజ…అమరావతి జేఏసీలో కీలక నాయకురాలు. వృత్తిరీత్యా వైద్యురాలు. కమ్మ సామాజిక వర్గం. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడి కుమార్తె. తన తమ్ముడి కూతురు శైలజకు టికెట్ అడుగుతున్నామని సాంబశివరావు చెప్పడంతో మరోసారి ఆమె వార్తల్లో వ్యక్తి అయ్యారు. రాజధాని అమరావతి పరిరక్షణ పేరుతో చేపట్టిన ఉద్యమంలో శైలజ కీలకంగా వ్యవహరించడం వెనుక ఆమెకు రాజకీయ ఉద్దేశాలున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది.
అమరావతిని బాగా వాడుకున్న వారిలో శైలజ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గుంటూరు -2 లేదా సత్తెనపల్లి నుంచి శైలజ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. గుంటూరు-2 నుంచి రవీంద్రచౌదరి అలియాస్ పెట్రోల్ బంకు నాని పోటీ చేయాలని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరోవైపు సత్తెనపల్లి టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. చివరికి దివంగత కోడెల శివప్రసాద్ ప్లెక్సీలను కూడా చించి పడేసే స్థాయిలో విభేదాలు చోటు చేసుకున్నాయి.
కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్ అంటే సత్తెనపల్లి టీడీపీ శ్రేణులు భగ్గుమనే పరిస్థితి. దీంతో అక్కడ టీడీపీని చక్కదిద్దాల్సిన పరిస్థితి ఉంది. కొత్త వారికి అక్కడ టికెట్ ఇస్తే తప్ప, టీడీపీ గట్టెక్కే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేయాలని ఇటీవల టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ ఆలోచిస్తున్నారు.
తాజాగా రాయపాటి శైలజ పేరు వినిపిస్తోంది. శైలజకు కలిసొచ్చే అంశం…రాయపాటి రాజకీయ కుటుంబ నేపథ్యం, కమ్మ సామాజిక వర్గం, డబ్బు, లాబీయింగ్. వీటినే నమ్ముకునే ఆమె రాజకీయాల్లో అడుగు పెట్టడానికి ధైర్యం చేస్తున్నారు.
గుంటూరు-2, సత్తెనపల్లిలో ఏదో ఒక చోట తనకు టికెట్ ఇవ్వాలని, ఎంత డబ్బైనా పెట్టుకుంటానని టీడీపీ అధిష్టానానికి ఆమె విన్నవించుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఆమె పేరు పరిశీలనలో వుంది. అమరావతి జేఏసీ నాయకురాలిగా అందరి దృష్టిని ఆకర్షించిన శైలజ, ప్రత్యక్ష ఎన్నికల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ముందుగా టికెట్ తెచ్చుకోవడం ఆమె ముందున్న అతి పెద్ద సవాల్.