షాక్‌…జ‌గ‌న్ మేన‌మామ‌కా? టీడీపీకా?

ఎల్లో మీడియా రాత‌లు మ‌రీ దిగ‌జారి పోయాయి. టీడీపీ కంచుకోట‌లో మూడు ద‌శాబ్దాల త‌ర్వాత వైసీపీ ఎమ్మెల్యే అడుగు పెడితే, అది అధికార పార్టీకి షాక్, సెగ అని రాయ‌డం ఎల్లో మీడియాకే చెల్లింది.…

ఎల్లో మీడియా రాత‌లు మ‌రీ దిగ‌జారి పోయాయి. టీడీపీ కంచుకోట‌లో మూడు ద‌శాబ్దాల త‌ర్వాత వైసీపీ ఎమ్మెల్యే అడుగు పెడితే, అది అధికార పార్టీకి షాక్, సెగ అని రాయ‌డం ఎల్లో మీడియాకే చెల్లింది. క‌మ‌లాపురం ఎమ్మెల్యే, సీఎం జ‌గ‌న్ మేన‌మామ పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి రాజ‌కీయంగా సాహ‌స‌మే చేశార‌ని చెప్పాలి. క‌మ‌లాపురం టీడీపీ ఇన్‌చార్జ్ పుత్తా న‌ర‌సింహారెడ్డి స్వ‌గ్రామం మాచిరెడ్డిప‌ల్లె పంచాయ‌తీ ప‌రిధిలో దేవ‌రాజుప‌ల్లె, బాలిరెడ్డిప‌ల్లె గ్రామాలుంటాయి.

క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో పుత్తా న‌ర‌సింహారెడ్డి అంటే ప్ర‌జ‌ల్లో ఒక ర‌క‌మైన భ‌యం వుంది. ఇదే ఆయ‌న ఓట‌మికి కార‌ణ‌మ‌వుతోంది. ప్ర‌జ‌ల‌తో దురుసుగా మాట్లాడ్డం మానుకోవాల‌ని ప‌లుమార్లు పుత్తాకు టీడీపీ అధిష్టానం సూచించినా, ఆయ‌న మాత్రం మార‌లేదు. దీంతో ప్ర‌జ‌లు ఆయ‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. పుత్తాపై వ్య‌తిరేక‌త‌నే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డికి రాజ‌కీయంగా క‌లిసొస్తోంది.

త‌న గ్రామ ప‌రిధిలోని దేవ‌రాజుప‌ల్లె, ఆ గ్రామ ఎస్సీ కాల‌నీ, బాలిరెడ్డిప‌ల్లె గ్రామాల్లో ప్ర‌త్య‌ర్థులు తిర‌గ‌డానికి పుత్తా ఒప్పుకునేవారు కాదు. అలాంటిది మూడు ద‌శాబ్దాల త‌ర్వాత అక్క‌డ వైసీపీ ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ప‌ర్య‌టించ‌డం విశేష‌మే. ఎమ్మెల్యే వ‌స్తున్నార‌ని తెలిసి… ఆ గ్రామాల్లోని ఎస్సీ కాల‌నీలో కొంత వ‌ర‌కూ జ‌నాన్ని టీడీపీ భ‌య‌పెట్ట‌గ‌లిగింది. బ‌ల‌వంతంగా ఇళ్ల‌కు టీడీపీ జెండాల‌ను క‌ట్టించారు.

ఎమ్మెల్యే వ‌చ్చే స‌మ‌యానికి కొంద‌రు ఎస్సీల‌ను ఊళ్లో లేకుండా చేసి, నిర‌స‌న‌గా ఖాళీ చేశార‌ని చెప్పుకోవ‌డం వారికే చెల్లింది. వైసీపీ ఎమ్మెల్యే రాక‌ను నిర‌సిస్తూ టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఇళ్ల త‌లుపులు వేసుకుని, లోప‌లే వుండిపోయార‌ని రాసుకుని శున‌కానందం పొంద‌డం వారికే చెల్లింది. 

అన్న‌ట్టు…దేవ‌రాజుప‌ల్లె ఎంపీటీసీ స్థానాన్ని గ‌తంలో వైసీపీ హ‌స్త‌గ‌తం చేసుకుంది. ఆ గ్రామంలో ర‌జ‌నీకాంత్‌రెడ్డి అనే యువ‌కుడు ప్రాణాల‌కు తెగించి పుత్తా న‌ర‌సింహారెడ్డికి ఎదురొడ్డాడు. ఇప్పుడు అత‌ని నేతృత్వంలోనే ఎమ్మెల్యే టీడీపీ త‌న కంచుకోట‌గా భావిస్తున్న గ్రామాల్లో ప‌ర్య‌టించ‌డం ముమ్మాటికీ ప్ర‌తిప‌క్షానికి పెద్ద షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.