ఇదీ సోషల్ మీడియా కాలం. రాజకీయ నాయకుల ప్రతి మాటను నెటిజన్లు జాగ్రత్తగా గమనిస్తున్నారు. కామెంట్స్ చేసే నేతల నిజాయతీ, సమాజంలో వారిపై ఉన్న అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని నెటిజన్లు తమవైన సృజనాత్మక ఆలోచనల్ని పంచుకుంటుంటారు. తాజాగా చంద్రబాబునాయుడి కామెంట్స్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబును ఒక మహిళ ఆసక్తికర ప్రశ్న వేశారు. మీకు ఆడపిల్ల లేదని ఎప్పుడైనా బాధపడ్డారా? ఆడపిల్ల వుంటే లోకేశ్‌లా రాజకీయాల్లో కొనసాగించేవారా? లేక వ్యాపార బాధ్యతలు అప్పగించేవారా? అని ఆమె ప్రశ్నించారు. బాబు స్పందిస్తూ… ఒక ఆడపిల్ల వుంటే బాగుండేదని నేను అనుకుంటుంటా అని సమాధానం ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలే బాబుపై సెటైర్స్ పేల్చడానికి కారణమయ్యాయి. చంద్రబాబుకు కూతురు వుంటే, ఆయన్ను వెన్నుపోటు పొడిచే అల్లుడు వచ్చి వుండేవాడంటూ వెటకరిస్తున్నారు. ఎందుకంటే లోకేశ్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, మామను స్ఫూర్తిగా తీసుకుని వారసత్వాన్ని బాబు అల్లుడు కొనసాగించే వారని దెప్పి పొడవడం గమనార్హం. ఎన్టీఆర్‌కు మొత్తం 12 మంది సంతానం. వీరిలో 8 మంది కుమారులు, నలుగురు కుమార్తెలు. ఏ ఒక్కరూ ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించలేకపోవడం తెలిసిందే.
అల్లుడైన చంద్రబాబు దయపై ఎమ్మెల్యే, మంత్రి పదవులు దక్కించుకున్నారనేది వాస్తవం. లోకేశ్‌కు అన్నీ మేనమామ గారి లక్షణాలే అన్న అభిప్రాయం వుంది. అందుకే చంద్రబాబుకు కూతురంటే, తప్పకుండా బాబుకు వెన్నుపొడిచే అల్లుడు వచ్చి వుండేవాడని కామెంట్స్ వస్తున్నాయి.