యువగళం పాదయాత్ర ఎఫెక్ట్ టీడీపీపై తీవ్రంగా పడింది. టీడీపీకి భవిష్యత్‌పై భరోసా విషయానికి వస్తే… లోకేశ్ పాదయాత్రకు ముందు, ఆ తర్వాత అని మాట్లాడుకోవాల్సి వుంటుంది. ఎన్నికలకు ఏడాది ముందు లోకేశ్ పాదయాత్ర టీడీపీలో కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. లోకేశ్ పాదయాత్ర టీడీపీ దిశా, దశలను మార్చేస్తుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బలంగా నమ్మారు. లోకేశ్ పాదయాత్ర వల్ల నష్టమే తప్ప, లాభం లేదని నమ్మిన ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమే అని అంటుంటారు.
బాబు అనుమానమే నిజమైందని ఇప్పుడు టీడీపీ సీనియర్లు వాపోతున్నారు. లోకేశ్ పాదయాత్రకు జనం నుంచి ఏ మాత్రం స్పందన రాకపోవడంతో టీడీపీ కేడర్‌లో నైరాశ్యం నెలకుంది. యువగళం పాదయాత్రకు ముందు… చంద్రబాబు ఏదో ఒక పేరుతో సభలు నిర్వహించేవారు. ఆయన సభలకు జనం పోటెత్తినట్టు కనిపించింది. దీంతో వైసీపీ సర్కార్‌కు ఆదరణ తగ్గుతోందని, టీడీపీకి పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యేవి.
దీంతో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఆ పార్టీ కేడర్‌లో కనిపించింది. ఈ కారణంగా చంద్రబాబు సభల్లో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్లొనేవారు. ఎప్పుడైతే లోకేశ్ పాదయాత్ర మొదలై, జనం కనిపించలేదో… అప్పటి నుంచి నాయకులు, కార్యకర్తల్లో నిరుత్సాహం ఆవహించింది. ప్చ్… మళ్లీ జగనే సీఎం అవుతారనే ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో టీడీపీ సభలకు వెళ్లడం ఎందుకనే నిర్లిప్తత ఆ పార్టీ నేతల్లో నెలకుంది.
అధికారంలోకి రాని పార్టీ వెంట వెళ్లి, అనవసరంగా వైసీపీ దృష్టిలో వ్యతిరేకిగా ముద్ర వేయించుకోవడం ఎందుకనే భావన టీడీపీ నేతలు, కార్యకర్తల్లో పెరుగుతోంది. లోకేశ్ పాదయాత్ర తీసుకొచ్చిన అతిపెద్ద నెగెటివ్ మార్పుగా చెప్పొచ్చు. పాదయాత్రలో లోకేశ్ నడుచుకునే తీరు కూడా విమర్శలపాలవుతోంది. నోటికొచ్చినట్టు ప్రత్యర్థులను తిట్టడానికే తప్ప, మళ్లీ తాము అధికారంలోకి వస్తే చేసే మంచి ఏంటో లోకేశ్ చెప్పడం లేదు.
టీడీపీకి లోకేశ్ నడక బలమవుతుందనుకుంటే, అందుకు విరుద్ధంగా బలహీనంగా మారింది. భవిష్యత్ లేని పార్టీపై అభిమానం పెంచుకుని, నష్టపోవడం కంటే, మన పనేదో చేసుకోవడం మంచిదనే అభిప్రాయానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు వచ్చారన్నది “పచ్చ” నిజం.