రాజీనామాలు.. బ్యాడ్ అయిడియా!

ముఖ్యమంత్రి వద్ద ఎక్కువ మార్కులు కొట్టేయాలని అనుకుంటున్నారో ఏమో గానీ.. నాయకులు తాము రాజీనామాలు చేసేసి, పదవులను త్యాగం చేసి మూడు రాజధానులకు మద్దతుగా ప్రజాభిప్రాయం కూడగడతాం అని వైసీపీలోని కొందరు నాయకులు ప్రతిజ్ఞలు…

ముఖ్యమంత్రి వద్ద ఎక్కువ మార్కులు కొట్టేయాలని అనుకుంటున్నారో ఏమో గానీ.. నాయకులు తాము రాజీనామాలు చేసేసి, పదవులను త్యాగం చేసి మూడు రాజధానులకు మద్దతుగా ప్రజాభిప్రాయం కూడగడతాం అని వైసీపీలోని కొందరు నాయకులు ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళదాం అంటున్నారు. ధర్మాన ప్రసాదరావు ఏకంగా మంత్రి పదవిని వదులుకుంటానని సెలవిస్తున్నారు. అయితే వీరు రాజీనామాలుచేయడం అనేది తెలివైన నిర్ణయమేనా? రాజీనామాల ద్వారా నిజంగా మూడు రాజధానులకు మద్దతుగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం అనేది సాధ్యమేనా? ఆ టెక్నిక్ ను ప్రజలు నమ్ముతారా? అనేది ఇప్పుడు ఎదురవుతున్న మీమాంస.

అమరావతి పాదయాత్ర నేపథ్యంలో.. తాము కూడా ఏదో ఒకటి చేయాలని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు అనుకుంటూ ఉండడం మనం గమనిస్తున్నాం. అయితే.. ఆ ప్రాంత ప్రజల్లో మూడు రాజధానుల పట్ల ఉండే సానుకూలతను, అమరావతి రైతుల యాత్ర పట్ల సహజంగా ఉండే వ్యతిరేకతను బయటకు చూపించడంలో వైసీపీ నాయకులు విఫలం అవుతున్నారు. ప్రజలు తమ స్వబుద్ధితో అమరావతి వారి యాత్రను వ్యతిరేకించే పరిస్థితి ఉన్నప్పటికీ.. అలాంటి ప్రజల నిరసనల వెనుక.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల ఫ్లెక్సి పోస్టర్లు  ఏర్పాటు చేస్తూ వ్యతిరేకత మొత్తం వైసీపీ నుంచి మాత్రమే ఉన్నదనే భావన కలిగిస్తున్నారు. 

ఇది చాలదన్నట్టుగా.. తాము రాజీనామాలున చేస్తామనడం మరో ఎత్తు. రాజీనామాలు చేస్తే ఏం జరుగుతుంది? ఉప ఎన్నిక వస్తుంది. సిటింగ్ సీట్లు గనుక వాళ్లు మళ్లీ గెలుస్తారు. అధికారంలో ఉన్నారు గనుక.. గతంలో కంటె పిసరంత ఎక్కువ మెజారిటీ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. పైగా రాజీనామా అనే మాట దాకా వెళ్లిన తర్వాత.. ఏ ధర్మాన ప్రసాదరావో, మరో ఎమ్మెల్యేనో రాజీనామా చేస్తే సరిపోదు. నిజమైన ఉత్తరాంధ్ర ప్రజాభిప్రాయం తెలియాలంటే.. యావత్ ఉత్తరాంధ్రలోని వైసీపీ నాయకులందరూ రాజీనామాలు చేయండి.. అప్పుడు మాత్రమే కరెక్టుగా ప్రజాభిప్రాయం తెలుస్తుంది.. అని విపక్షాలు సవాలు చేసే ప్రమాదం ఉంది. అలా అందరూ రాజీనామా చేయడం అనేది జరిగే పని కాదు. 

పైగా రాజీనామా అనే సవాళ్లు చేయడమే బ్యాడ్ అయిడియా! ఏదో హడావుడి చేయడానికి తప్ప మరొకందుకు పనికిరాదు. ప్రజలు వారిని అయిదేళ్ల పాటు సేవ చేయడానికి ఎన్నుకున్నారు. అనివార్య పరిస్థితులు వస్తే వేరే సంగతి.. ఇతరత్రా స్వల్ప కారణాలకోసం రాజీనామాలు చేస్తే అది ప్రజల తీర్పును పరిహసించడమే. ఆ సంగతి గుర్తుంచుకుని నాయకులు వ్యవహరించాలి. పైగా ధర్మాన వంటి వారు రాజీనామా చేస్తా అనే పదం అనగానే.. తన మీద వస్తున్న భూబాగోతపు ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి రాజీనామా డ్రామా అంటూ కొత్త విమర్శలు కూడా పుడుతున్నాయి. 

ఎందుకొచ్చిన అనవసరపు సవాళ్లు ఇవన్నీ.. వాస్తవమైన ప్రజాభిప్రాయంతో నాయకులు ఎందుకు కలిసి నడవలేకపోతున్నారు. అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.