మంత్రి ఆర్కే రోజా సవాల్ విసిరారు. గడపగడపకూ మన ప్రభుత్వంపై బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్క్‌షాప్ నిర్వహించడంపై టీడీపీ, ఎల్లో మీడియా తమ మార్క్ విమర్శలు చేయడంపై రోజా మండిపడ్డారు. సీఎంతో సమావేశానికి హాజరయ్యేందుకు విజయవాడ వెళ్లిన రోజా… మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షానికి సవాల్ విసిరారు.
టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యం వుంటే … వాళ్ల నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ ఇన్‌చార్జ్‌లు కూడా రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ ఎన్నికల ప్రణాళిక, తమ ఎన్నికల ప్రణాళికను ప్రజల వద్దకు తీసుకెళ్తామన్నారు. ప్రజలకు ఎవరేం చేశారో ప్రజల వద్దే తేల్చుకుందామని రోజా సవాల్ విసిరారు.
మీడియా సమక్షంలోనే ప్రజలకు ఎవరేం చేశామో తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఒక ఊళ్లో 200 ఇళ్లుంటే, ఒకరిద్దర్ని రెచ్చగొట్టి పంపించి, వీడియో తీసి, టీడీపీ వాళ్లు రెండుమూడు రోజులు శునకానందం పొందారని విమర్శించారు. ఆ తర్వాత అది కూడా దిక్కులేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
దేశంలో ఏ ప్రభుత్వమైనా మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న తర్వాత ఇంటింటికి వెళ్లగలిగిందా అని ప్రశ్నించారు. ప్రజల్లోకి వెళ్లిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. ఎన్నికల వాగ్దానాలకు 95 శాతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి చేశారన్నారు. అందుకే తాము చాలా ధైర్యంగా వెళుతున్నామన్నారు.
గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లినపుడు లబ్ధిదారుల్లో తమ కొడుకు, అల్లుడు, కూతురు ఉన్నారని చెబుతుంటే కళ్లలో నీళ్లు వచ్చాయన్నారు. జీవితానికి ఇది చాలు అనిపించిందన్నారు.
జగన్ పాలనలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు రోజా చెప్పారు. పచ్చ చానళ్లలో తెలుగుదేశం నేతలు ఎన్నైనా మాట్లాడ్తారన్నారు. కానీ పబ్లిక్‌లోకి వస్తే వాస్తవాలేంటో తెలుస్తాయన్నారు. రేపు ఓట్లు వేసేది ప్రజలే అన్నారు. సిగ్గు లేకుండా జాకీలు వేసుకుంటూ పచ్చ చానళ్లలో మాట్లాడే టీడీపీ వాళ్లకే చెల్లిందన్నారు.
టీడీపీ వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్నారు. జాకీలేసి పైకి లేపే మీడియాను నమ్మి టీడీపీకి 23 సీట్లు వచ్చాయన్నారు.