ప్రత్యర్థులపై మంత్రి ఆర్కే రోజా అన్‌స్టాపబుల్ పంచ్‌లు విసిరారు. ఓ చానల్‌తో ఆమె మాట్లాడుతూ లోకేశ్, బాలకృష్ణ, పవన్‌లపై తనదైన రీతిలో ఆమె విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా లోకేశ్‌పై ఓ రేంజ్లో సెటైర్స్ వేశారు. అన్‌స్టాపబుల్ షోను మొదట్లో బాలయ్య బాగా చేశాడని అనిపించిందన్నారు. తనను కూడా ఆ షోకు పిలిచారన్నారు.
అయితే అప్పుడు అసెంబ్లీ కార్యకలాపాలు వుండడం వల్ల వెళ్లడానికి కుదర్లేదన్నారు. బాలకృష్ణ, తాను కలిసి ఏడు సినిమాల్లో నటించామన్నారు. తమది హిట్ కాంబినేషన్ అని ఆమె చెప్పుకొచ్చారు. అన్స్టాపబుల్కు వెళ్లాలని అనుకున్నట్టు చెప్పారు. కానీ చనిపోయిన ఎన్టీఆర్‌ను పూల్ చేసేలా, అలాగే ఆయనకు వెన్నుపోటు పొడవడం కరెక్ట్ అనే విధంగా …వేదికను ఉపయోగించుకుని రాజకీయం చేయడం తనకు నచ్చలేదన్నారు. అందుకే ఆ షోకు జీవితంలో వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు రోజా తెలిపారు.
అధికారంలో వుండగా తన కొడుక్కి అడ్డదారిలో మంత్రి పదవి ఇవ్వడం తప్ప, ఈ రాష్ట్రంలోని యువతకు ఏం చేశారు? అని రోజా నిలదీశారు. తమ ప్రభుత్వం పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని చట్టం తేవడంతో పాటు వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు.
సిగ్గు లేకుండా యువగళం పేరుతో లోకేశ్ పాదయాత్ర ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోకేశ్ ఏ మొహం పెట్టుకుని యాత్రలు చేస్తారు? అని మంత్రి రోజా ప్రశ్నించారు. యువతకు ఏం చేశారో చెప్పాకే యాత్రలు చేయాలని ఆమె సూచించారు. యువశక్తి అని ఒకరు, యువగళం పేరుతో మరొకరు వస్తుంటే యువత నవ్వుతున్నారని అవహేళన చేయడం గమనార్హం.
లోకేశ్‌కు పాదయాత్ర మంచి వ్యాయామానికి పనికొస్తుందన్నారు. తినింది అరగడానికి ఉపయోగపడుతుందని, అలాగే హెల్త్‌కు మంచిదని రోజా పంచ్‌లు వేశారు. లోకేశ్ పాదయాత్ర చేసినా, పవన్ వారాహి అంటూ వచ్చినా ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధిస్తామని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల టూరిజం గురించి నాగబాబు విమర్శలు చేయడాన్ని ఆమె మరోసారి తప్పు పట్టారు. టూరిజం గురించి కొందరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్ జోకర్ల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాగబాబుపై ఘాటు విమర్శ చేశారు.