బ్యాలెట్ పేపర్ తో మొదలైన మన ప్రజాస్వామ్యం.. ఇటీవల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (EVM) వరకు చేరింది. ఇప్పుడు సరికొత్తగా రిమోట్ ఓటింగ్ మిషన్ (RVM) తెరపైకి వచ్చింది. గత నెలలో ఈ RVM పై చిన్న హింట్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈరోజు దానిపై వివిధ రాజకీయ పార్టీలకు ఢిల్లీలో డెమో ఇచ్చింది. అయితే EVM ఓటింగ్ పైనే సవాలక్ష సందేహాలున్న మన దేశంలో.. RVMలను రాజకీయ పార్టీలు స్వాగతిస్తాయా. అసలు RVM అంటే ఏంటి..? అదెలా పనిచేస్తుంది?
పులివెందులలో ఓటు హక్కు ఉన్నవారు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నా.. పోలింగ్ రోజు సొంత ఊరికి వెళ్లాల్సిన పని లేదు. హైదరాబాద్ లోనే ఉండి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. విశాఖలో ఓటు హక్కు ఉన్నవారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినా.. తమ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలో అక్కడినుంచే నిర్ణయించొచ్చు. దీన్నే రిమోట్ ఓటింగ్ అంటారు. నివాసం ఉన్నప్రాంతంలోనే ఓటు వేస్తారు. కానీ సొంత ఊళ్లో ఉన్న పోలింగ్ బూత్ లో వారి ఓటు నమోదవుతుంది. ఇక్కడ ఉంటారు, అక్కడ ఎవరు గెలవాలో డిసైడ్ చేస్తారు. అదే రిమోట్ ఓటింగ్.
EVM లో కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన సమాచారమే ఉంటుంది. కానీ RVMలో 72 నియోజకవర్గాలకు సంబంధించిన డేటా ఉంటుంది. దాని ప్రకారం ఆ 72 నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు ఒకే చోట ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ ను ఎలా వినియోగించుకుంటారో.. పోలింగ్ రోజు సొంత ప్రాంతానికి దూరంగా ఉన్నవారు రిమోట్ ఓటింగ్ మిషన్ ద్వారా అలాగే ఉపయోగించుకుంటారు. అంటే వృథా ఓటుని RVM ద్వారా నియంత్రించవచ్చనమాట. 2019 సార్వత్రిక ఎన్నికలలో 67.4 శాతం ఓటింగ్ నమోదైంది, 30 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఆర్వీఎంల రాకతో ఓటు హక్కు వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుందని ఈసీ అంచనా వేస్తోంది.
ఈ RVM ద్వారా ఓటు ఎలా వేస్తారు, ఏ నియోజకవర్గాన్ని ఎలా ఎంచుకుంటారు అనే విషయాలపై ఈరోజు ఢిల్లీలో ఈసీ వివిధ పార్టీలకు డెమో ఇచ్చింది. దీనిపై వారి అభ్యంతరాలను తమకు తెలియజేయాలని చెప్పింది. ఈసీ డెమోకి ముందే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొన్ని పార్టీలు సెపరేట్ గా మీటింగ్ పెట్టుకున్నాయి. ఆర్వీఎం మనకు వర్కవుట్ కాదని తేల్చేశాయి. అధికార పార్టీలు ఆర్వీఎంలను దుర్వినియోగం చేస్తాయని అనుమానించాయి.
మనకు వర్కవుట్ అవుతుందా..?
పోలింగ్ రోజు ఈవీఎంలను తరలించడం, భద్రపరచడం పోలీసులకు, అధికారులకు తలకు మించిన భారంగా మారుతుంది. ఇప్పుడు ఆర్వీఎంలను కూడా తగిన రీతిలో భద్రపరచాలి. ఒకవేళ ఏపీలో ఎన్నికలు జరుగుతుంటే, హైదరాబాద్ లో కోడ్ అమలులో ఉండదు. అయితే అక్కడ ఆర్వీఎంలను వినియోగిస్తే ఆమేరకు ఎన్నికల సిబ్బందిని కేటాయించాలి, భద్రత ఏర్పాట్లు చేయాలి. ఇది కూడా అక్కడి ప్రభుత్వాలకు తలకి మించిన భారంగా మారుతుంది.
ఆర్వీఎంలు వినియోగించాలంటే వలస ఓటర్లు ఎంతమంది ఉండాలి, వారంతా ఎక్కడికి రావాలి అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అలాంటివారు ఉన్నా కూడా దొంగఓట్లు వేస్తే అప్పుడు ఆర్వీఎంలతో కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నట్టే లెక్క. ఊరిలో ఉంటే దొంగఓటర్లు ఎవరో పోలింగ్ ఏజెంట్లు పసిగడతారు. మరి పరాయి ఊరిలో ఓటు వేస్తే అక్కడ వారు అసలైన ఓటరే అని నిర్థారించేదెవరు..? ఈవీఎంలపైనే సవాలక్ష సందేహాలు ఉన్న ఈటైమ్ లో ఆర్వీఎం అంటూ ఎన్నికల కమిషన్ ఇప్పుడు కొత్త ప్రయోగం మొదలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే వాదన కూడా వినపడుతోంది.