చంద్రబాబు, పవన్ భేటీపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ అక్రమ సంబంధానికి పవిత్రతను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన ఎప్పుడూ కలిసే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
2024 షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న పార్టీలే ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయన్నారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో లేరన్నారు. ప్రజలు ఐదేళ్ల కాలానికి తీర్పు ఇచ్చారన్నారు. ప్రతిపక్షాలు తాము సజీవంగా ఉన్నామని చెప్పడానికి ముందస్తు ఎన్నికల ప్రకటనలు చేస్తున్నారని మొట్టికాయలేశారు. బలమైన జగన్‌ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష నేతలంతా ఏకమవుతున్నారన్నారు.
ప్రతిపక్ష నేతలు రహస్యంగా ఎందుకు సమావేశం అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. తమ అక్రమ సంబంధాలు సక్రమం అని చెప్పడానికే ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. చంపిన వాళ్లను పరామర్శించడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. 11 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును పవన్ పరామర్శించడం సిగ్గుచేటన్నారు. చనిపోయిన 11 మంది కుటుంబాలను పవన్ కనీసం పరామర్శించలేదని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంత మంది కలిసి వచ్చినా తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒకేసారి ఓడించే అవకాశం జగన్‌కు వస్తుందన్నారు. 2014లో టీడీపీ పల్లకీని పవన్ మోశారని విమర్శించారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే పవన్ పోటీ చేశారన్నారు. చంద్రబాబు యాక్షన్ ప్లాన్‌లో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు.