విశాఖ అంటే ఒక అరుదైన ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు. విశాఖ సాగరతీరం ఒడ్డున ఉన్న సిటీ. ఇక్కడ చలికాలంలో వెచ్చగా వేసవిలో చల్లగా ఉంటుంది. అలనటి విశాఖ మీద ఒక్కసారిగా చలిపులి విరుచుకుపడిపోయింది. దాదాపుగా రెండు దశాబ్దాల తరువాత భారీ ఎత్తున చలి వాతావరణం కనిపించింది, అల్లాడించేసింది.
విశాఖలో చలికాలం అంటే ఏ అర్థరాత్రో కాస్తా కనిపించేది. దాంతో అపుడు దుప్పటితో సరిపోయేది. కానీ గత మూడు రోజులుగా పెచ్చరిల్లిన చలితో విశాఖ షేక్ అవుతోంది. మధ్యాహ్నం పన్నెండు అయినా నెత్తిన టోపీ వంటిన స్వెట్టర్ తో జనాలు బయటకు రావాల్సి వస్తోంది అంటే సీన్ ఊహించుకోవచ్చు.
విశాఖలో ఒక సినిమా ఫంక్షన్ కి వచ్చిన హీరో రవితేజా స్టేజ్ మీదనే వామ్మో విశాఖలో ఇంతటి చలి ఏంటి అనేశారు. విశాఖ సిటీలో పదిహేను లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమదు అవుతూంటే ఆంధ్రా కాశ్మీర్ లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా ఒక సెంటిమీటర్ కి పడిపోయాయి. అంటే మంచు దుప్పటి ఏజెన్సీ కప్పుకుంది అన్న మాట.
ఆంధ్రా ఊటీ అరకు తదితర ప్రాంతాలలో మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏజెన్సీతో పాటు విశాఖ రూరల్ జిల్లాలో అయిదారు డిగ్రీల కనిష్టానికి ఉష్ణోగ్రతలు చేరాయి అంటే చలి తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవాల్సిందే. ఉత్తరాంధ్రా జిల్లాలు మొత్తం చలితో వణుకుతున్నాయి. రానున్న మూడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.