పత్రికలన్నీ అర్ధసత్యాలే రాస్తాయి. దీంట్లో ఎవరికీ మినహాయింపు లేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఒక విచిత్ర వాతావరణం ఉంది. ఈనాడు, సాక్షిల మధ్య “ఏది నిజం?” అనే నాటకం నడుస్తూ వుంటుంది. వాస్తవానికి ఇది ఏకపక్షం. సాక్షిని కౌంటర్ చేస్తూ “ఇది నిజం” అంటూనో, “సత్యం తెలుసుకో జగన్” అంటూ నిలదీస్తూనో ఈనాడులో వార్తలు రాయరు.
సాక్షిలో మాత్రం “ఈనాడు తప్పుడు వార్తలు, నిజం తెలుసుకో రామోజీ, అప్పుడు నిద్రపోతున్నావా రామోజీ” అంటూ డైరెక్ట్ ఎటాక్ వుంటుంది. తాము రాయకపోతే ఈనాడులో వచ్చేవన్నీ నిజాలని జనం నమ్మేస్తారని సాక్షి భయం, బాధ. నిజానికి సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనం లెక్కలు మారిపోయాయి. ఎవరి లైన్ వారిది. జగన్ అభిమానులు ఈనాడుని నమ్మరు. తెలుగుదేశం వాళ్లు సాక్షిని నమ్మరు. మధ్యస్తంగా వుండే వాళ్లకి రెండు పేపర్లు చదివి నిజాలు తెలుసుకునే ఓపికా లేదు, టైమూ లేదు.
నిజానికి ఈనాడు అబద్ధాలు రాయదు. ముందు నుంచి దాని స్టైల్ అర్ధసత్యమే. సగం గ్లాస్లో నీళ్లు వుంటే అనుకూలతను బట్టి సగానికి పైగా నీళ్లున్నాయ్, లేదా సగానికి పైగా ఖాళీ వుందని రాస్తుంది. రెండూ నిజాలే. 10 కి.మీ రోడ్డు నాణ్యంగా వుండి, ఐదారు గోతులు వుంటే, గోతుల్నే హైలైట్ చేస్తుంది. అనుకూలంగా రాయాలంటే నిగనిగలాడే రోడ్డుని పొగుడుతూ రాస్తుంది. రెండూ నిజాలే. ఇది తెలియకుండా ఈనాడు ట్రాప్‌లో పడి సాక్షి అరపేజీ అకౌంట్స్ లెక్కల పుస్తకాన్ని ఏది నిజం పేరుతో నింపి “రామోజీని భలే ఆడుకున్నాం” అని సాయంత్రం జరిగే సాక్షి మీటింగ్‌ల్లో బిస్కెట్లు తిని, టీ తాగుతారు.
పోనీ, ఆ వివరణ అయినా సరిగా ఇస్తారా అంటే వీళ్లు రాసేది అర్ధసత్యాలే. ఉదాహరణకి శనివారం ఏది నిజం తీసుకుందాం.
పేద ముస్లింల పెళ్లికి దుల్హన్ పథకం కింద రూ.50 వేలు ఇవ్వాలని చంద్రబాబు 2015లో అనుకున్నాడు. 2016లో పథకం ప్రారంభమై 2018, ఏప్రిల్ నుంచి ఆపేశారు. మధ్యలో అన్ని కులాలకు వర్తింపజేస్తూ చంద్రన్న పెళ్లి కానుకగా ఇది మారింది. దిగిపోయేసరికి 94 కోట్లు పెండింగ్‌లో వుంది. జగన్ వచ్చాడు. బకాయిలపై దృష్టి పెట్టాడు. పూర్తిగా చెల్లించాడో లేదో ఈ వార్తలో లేదు.
కోవిడ్ కారణం వల్ల పథకాన్ని అమలు చేయలేకపోయారు. ఇక్కడి వరకూ ఓకే. మరి రెండేళ్లలో బకాయిల సంగతిని పక్కన పెడితే చంద్రబాబు ఎంతిచ్చాడో చెప్పరు. సరే అది మనకి నెగెటివ్ అనుకుంటే, ఆ రోజు రామోజీ నిలదీస్తే మీకెందుకు? నిలదీయకపోతే మీకెందుకు? సాక్షిలో మీరు ఏ మాత్రం నిలదీశారో ఆ కటింగ్ పెట్టాలి కదా!
ఇంకొకటి విదేశీ విద్యాదీవెన పథకం. విదేశాల్లో చదువుకునే పిల్లల కోసం ఆర్థిక సాయం. దీన్ని ఒకటి రెండేళ్లు అమలు చేసిన చంద్రబాబు 318 కోట్లు బకాయి పెట్టి దిగిపోయాడు. ఈ పథకంలో అవకతవకలు జరిగాయని జగన్ ప్రభుత్వం గ్రహించింది. 112 కోట్ల బకాయిలు మాత్రం చెల్లించి పథకాన్ని పక్కన పడేసింది. ఎందుకంటే పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారట!
ఒక పథకం మంచీచెడ్డలు సమీక్షించడానికి మూడేళ్ల పడితే ఇంత మంది అధికారులు, సలహాదారులు ఎందుకో సాక్షికే తెలియాలి. మీరు రాసినట్టు రామోజీ దిగ్గున లేచి స్టోరీలు వండడం లేదు. చాలా ప్లాన్డ్‌గానే వండుతున్నాడు. ట్రాప్‌లో పడి మీరే ఏది నిజం వండుతున్నారు.