రాజకీయాల్లో పవన్‌కల్యాణ్ ఒక విచిత్రమైన నాయకుడు. ఎక్కడైనా తాను ముఖ్యమంత్రి కావాలని రాజకీయ పార్టీ అధినేత కోరుకోవడం చూశాం. అదేంటో గానీ, పవన్‌కల్యాణ్ మాత్రం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద నిత్యం పడి ఏడుస్తున్నారు. వైఎస్ జగన్‌పై అంత ద్వేషం ఎందుకో అంతుచిక్కడం లేదు. మళ్లీ తనే జగన్‌పై ద్వేషం లేదని అంటుంటారు. 2014లోనే మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో తలపడుతున్న వైఎస్ జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కానివ్వనని పవన్‌కల్యాణ్ శపథం చేశారు.
అనేక రాజకీయ సమీకరణల దృష్ట్యా పవన్ బలపరిచిన టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో పవన్‌కల్యాణ్ జనసేన పేరుతో కొత్తగా పార్టీ స్థాపించి, ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమి తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. 2019కు వచ్చే సరికి టీడీపీ, బీజేపీ కూటమి నుంచి పవన్ వేరు పడ్డారు. నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, జగన్‌ను సీఎం చేయకుండా అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారాయన. 2019లో కూడా జగన్‌ను సీఎం కానివ్వనని శపథం చేశారు.
అయితే పవన్ కుట్రల్ని పసిగట్టిన జనం ఆయనకు గట్టిగానే బుద్ధి చెప్పారు. కనీసం పవన్‌ను కూడా గెలిపించలేదు. ప్రజలకు ఆకాంక్షలకు విరుద్ధంగా రాజకీయాలు చేస్తే, ఫలితాలు ఎలా వుంటాయో పవన్‌కు రుచి చూపించారు. అయినా ఆయనలో మార్పు రాలేదు.
జగన్‌పై మరింత ద్వేషాన్ని పెంచుకున్నారు. కులాలు, మతాల పేరుతో జగన్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో చీలిక తెచ్చి, తనకిష్టమైన చంద్రబాబును అధికార పీఠంపై కూచోపెట్టాలని పవన్‌కల్యాణ్ తహతహలాడుతున్నారు. ఏపీని వైసీపీ పాలన నుంచి విముక్తి చేస్తానని రంకెలేస్తున్నారు. బైబై వైసీపీ అంటూ నినదిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ సీట్లలో కనీసం ఒక్క చోట కూడా వైసీపీని గెలవనివ్వకూడదనేది తన కోరికగా ఆయన చెప్పారు.
వైసీపీ నుంచి విముక్తి అనే నినాదాన్ని భుజాన వేసుకోకపోతే టీడీపీ నుంచి భుక్తి లభించదని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. పవన్‌ను ప్యాకేజీ స్టార్ అంటూ ఇప్పటికే వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పల్లకీ మోయడానికి కాపుల ఆత్మాభిమానాన్ని బలి పెట్టారని దర్శకుడు రాంగోపాల్‌వర్మ లాంటి వారు ఇప్పటికే ట్వీట్లు చేశారు.
జగన్‌పై విపరీతమైన ద్వేషాన్ని ప్రదర్శిస్తున్న పవన్‌కల్యాణ్ నిబద్ధతపై సొంత వాళ్లు అనుమానపడే పరిస్థితి. ఊరికే చంద్రబాబును భుజాన ఎందుకు మోస్తారని, ఇందులో ఆర్థిక లావాదేవీలున్నాయనే ఆరోపణల్లో నిజం లేకపోలేదనే చర్చ పవన్ అభిమానుల్లో అంతర్గతంగా మొదలైంది. భుక్తి కోసం విముక్తి నినాదం ఎత్తుకోక తప్పడం లేదు పాపం అని నెటిజన్లు సెటైర్స్ విసురుతుండడం ఆసక్తికర పరిణామం.