ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున గంజాం జిల్లాలోని దిగపహండి సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సును పెండ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది స్పాట్ లోనే మృతిచెందగా, మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను బర్మాపూర్లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాయ్‌గఢ్ నుండి భువనేశ్వర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టడంతో.. ప్రమాదంలో ఎక్కువ మంది ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్నవారే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఈ ప్రమాదంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతులకు రూ. 3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు.