కులాలను ప్రస్తావించకుండా.. కాపులు రెడ్లు అనే టాపిక్ తేకుండా.. పవన్ కల్యాణ్ ఎన్నడైనా ఒక్క ప్రసంగమైనా చేసిన దాఖలా చరిత్రలో ఉందా? ప్రత్యేకంగా కులాలవారీగానే సమావేశాలు జరిగినప్పుడు తప్ప ముఖ్యమంత్రి జగన్ గానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గానీ.. ఇలాంటి కులగజ్జి మాటలు ఎన్నడైనా మాట్లాడారా? అర్థం పర్థంలేని ఆవేశం, తర్కానికి అందని మాటలు, నిలకడలేని వ్యవహార సరళి, సీరియస్ ఆరోపణల సమయంలోనే వెకిలి జోకులను సంధిస్తారు.
సినిమా షూటింగుల మధ్య గ్యాప్ లోనే ప్రజల ఎదుటకు వచ్చి, వారి బాధలపై ఆవేశపడిపోయే ఈ పార్ట్ టైం రాజకీయ నాయకుడు.. ‘నేను సీఎం అవుతా’ అంటూ ఒకటికి పదిసార్లు పారాయణం చేయడం ఒక కామెడీ! కులమతాలు అంటని వ్యక్తిని తాను అని చెప్పుకునే పవన్ కల్యాణ్ వారాహియాత్ర, ప్రసంగాల దూకుడు, ఔచిత్య విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘విశ్వమానవుడి లక్షణ సంపద!’
పవన్ కల్యాణ్ వారాహి యాత్ర అనేది పోయిన ఏడాది నాటి ప్రణాళిక! గత ఏడాది విజయదశమి నాటికి వారాహి యాత్ర ప్రారంభిస్తానని పవన్ కల్యాణ్ అప్పట్లో చాలా డాంబికంగా ప్రకటించారు. అది వాయిదాపడీపడీ.. మొత్తానికి ఇప్పుడు ప్రారంభం అయింది. ఈ ఏడాది కూడా వారాహి యాత్ర అనేది తిరుపతినుంచి ప్రారంభం అవుతుందని తొలుత ప్రకటించారు పవన్ కల్యాణ్! కానీ.. పవన్–చంద్రబాబు కూటమిలో ఎన్నికలు ముందస్తుగా వస్తాయనే భయం ఉంది. మంచో చెడో తిరుపతి ప్రాంతాన్ని నారా లోకేష్ ఆల్రెడీ కవర్ చేశారు.
లోకేష్ గోదావరి దాకా నడుచుకుంటూ వచ్చేలోగా ఎన్నికలు వచ్చేస్తే ఎలా అనే భయం వారిలో ఉంది. అందుకే చంద్రబాబు స్కెచ్ మేరకు ఆయన వారాహి యాత్రా ప్రారంభ వేదిక అనేది తిరుపతి నుంచి అన్నవరం కు మారింది. అవన్నీ కూడా వారి రాజకీయ వ్యూహాల్లో భాగం అని సరిపెట్టుకోవచ్చు. కానీ వారాహి యాత్ర గురించి ప్రకటించిన సందర్భంలో పార్టీలోని నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ ఏం చెప్పారో ఒకసారి గుర్తు చేసుకోండి ‘‘పవన్ కల్యాణ్ ఉభయగోదావరి జిల్లాల్లో చేస్తున్న వారాహి యాత్ర ఎన్నికల ప్రచార యాత్ర కాదు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన యాత్ర మాత్రమే’’ అని నాదెండ్ల అన్నారు.
ఒక్కో నియోజకవర్గానికి రెండేసి రోజులు కేటాయిస్తారని, కార్యకర్తలతో సమావేశాలు, జనవాణి కార్యక్రమాలు, వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు ఉంటాయని, అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక బహిరంగ సభ ఉంటుందని.. ఇవన్నీ కూడా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు మాత్రమే అని నాదెండ్ల ప్రకటించారు. తీరా యాత్ర ప్రారంభం అయ్యేసరికి దానికి‘వారాహి విజయయాత్ర’ అని పేరు పెట్టారు. యాత్ర పేరులోకి ‘విజయ’ అనే పదం ఎలా ఎందుకు వచ్చి చేరిందో ఎవ్వరికీ తెలియదు.
స్వతహాగా సినిమా నటుడు అయిన పవన్ కల్యాణ్ కు సినీ పరిశ్రమ వారి పోకడలు గుర్తుకు వచ్చినట్లున్నాయి. సినిమాకు డివైడ్ టాక్ ఉన్నదని, కాస్త హైప్ క్రియేట్ చేస్తే ఫ్లాప్ కాకుండా అడ్డుకోవచ్చునని ఆశ పుట్టినప్పుడు ‘విజయయాత్ర’ అని పేరు పెట్టి సినిమా జట్టు మొత్తం కలిసి ఒక ప్రహసనం నడిపిస్తుంటారు. అచ్చంగా పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న యాత్ర కూడా అదేతీరుగా ఉంది. యాత్ర పేరు ప్రకటించే విషయంలోనే ఒక క్లారిటీ లేకుండా రకరకాలుగా వారు ఎన్ని రకాల కన్ఫ్యూజన్ కు గురయ్యారో.. ఆ కన్ఫ్యూజనే పవన్ కల్యాణ్ లోని అసలు కేరక్టర్.
ఎన్నికల యాత్రే!
పవన్ కల్యాణ్ అచ్చమైన ఎన్నికల యాత్రను ప్రారంభించారు. కానీ, అస్పష్టతకు, కన్ఫ్యూజన్ కు మారుపేరైన పవన్ కల్యాణ్ కు ఎన్నికల యాత్రను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో కూడా తెలియదు. అచ్చంగా ఎన్నికల ప్రచార సభల డైలాగులనే పవన్ ఈ యాత్రలో పలుకుతున్నారు. కాకపోతే ఎన్నికల యాత్ర అయితే.. ఏ ఊర్లో పార్టీ అధినాయకుడు మాట్లాడుతోంటే.. ఆయన వెంట అభ్యర్థి కూడా నిల్చుని ఉంటారు. కానీ పవన్ సభల్లో వారాహి వేదిక మీద కనిపించేది కేవలం పవన్ మాత్రమే.
ఎందుకంటే ఏ సీటులో ఏ అభ్యర్థి పోటీచేస్తారో ఇప్పటిదాకా పవన్ కే తెలియదు. ఒకవేళ ఆ క్లారిటీ ఉన్నా, ఆ నాయకుడిని తన పక్కన నిల్చోబెట్టుకుంటే.. తెల్లవారే లోగా మిగిలిన ఆశావహులంతా పార్టీని వీడి వెళ్లిపోతారని భయం. అభ్యర్థుల సంగతి అటుంచితే.. అసలు ఏ సీటులో జనసేన పోటీచేస్తుందో, ఏ సీటులో చేయదో కూడా పవన్ కు క్లారిటీ లేదు. ప్రతి ఊరిలోనూ పవన్ రంకెలు వేయవచ్చు గాక, ప్రతి ఊరిలో అక్కడి లోకల్ వైసీపీ ఎమ్మెల్యేను ఓడిస్తానని ప్రతిజ్ఞలు చేయవచ్చు గాక.. కానీ అక్కడ తన పార్టీకి చాన్స్ వస్తుందో లేదో కూడా ఆయనకు తెలియదు. అందుకే ఒక్కడే వేదిక ఎక్కి తోచినదెల్లా మాట్లాడుతూ.. చేతనైనంత తిడుతూ.. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలి.. అని సింగిల్ పాయింట్ ను మాత్రమే వల్లిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు.
జగన్ ను ఎందుకు ఓడించాలి?
జగన్ ను ఓడించాలనడం ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కోరిక.. మంచిదే! కానీ ఎందుకు ఓడించాలి? ఆ కారణాలను కూడా విపక్ష నాయకులు చెప్పి ప్రజలను నమ్మించాలి. కానీ పవన్ ఆ పని చేయడం లేదు. జగన్ అమలు చేస్తున్న పథకాల్లో లోపం ఉంటే చెప్పాలి. అవినీతి ఉంటే చెప్పాలి. కానీ ఆయన మాటల్లో అవేం ఉండవు. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు.. ఆయనను ఓడించేయాలి.. ఇంతకు మించి మరో మాట చేతకాదు.
పవన్ కల్యాణ్ తన గురించి తాను మరీ ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. భారదేశంలోనే తాను అతిపెద్ద రెమ్యునరేషన్లు తీసుకునే నటుల్లో ఒకడినని అంటారు. మరోవైపు కుటుంబం గడవడం కోసమే సినిమాలు చేస్తున్నానని అంటారు. తనను చంపడానికి సుపారీ ఇచ్చారని, తనకు ప్రాణహాని ఉన్నదని, వైసీపీ ప్రభుత్వం తనను అడ్డు తొలగించుకోవాలని అనుకుంటున్నదని అంటారు. అదే సమయంలో.. తాను కనుసైగ చేస్తే చాలు.. వైసీపీ నాయకులు ప్రాణాలతో మిగలరని హెచ్చరిస్తారు.
తనను చూసి ప్రభుత్వం జడుసుకుంటున్నదని అంటుంటారు. తాను పూనుకుంటే.. ప్రభుత్వం రోడ్ల రిపేర్లు చేసేస్తుందని, తాను ఏ ప్రాంతానికైనా వస్తున్నట్లు తెలిస్తే ఆ ప్రాంతంలో ప్రజలకు రావాల్సిన పనులన్నీ వెంటనే ఇచ్చేస్తారని .. అదంతా తనను చూసి జడుసుకోవడం వల్లనే ఇస్తున్నట్టుగా పవన్ రంగు పులుముతూ ఉంటారు. అలా సంతోషిస్తూ ఉంటారు. జగన్ ద్రోహి, ఓడించాలి అంటారే తప్ప.. ప్రజలు నమ్మగల కారణాలు ఒక్కటైనా చెప్పలేకపోవడం పవన్ అసమర్థత!
కులం, మతం, విద్వేషం, అతివాగుడు
కొన్ని ప్రసంగాలలో పవన్ కల్యాణ్ తనను తాను విశ్వమానవుడిగా అభివర్ణించుకుంటూ.. అలాంటలి కవితలను చదివి వినిపిస్తూ, తనకు కులం మతం ఉండవని ప్రవచిస్తూ మాట్లాడుతూ ఉంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఇలాంటి మనుషులు ఈరోజుల్లో ఉంటారా అనిపిస్తుంది. ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కూడా అనిపిస్తుంది. కానీ అలా అనుకున్న వారికి ఆ ఆనందాన్ని పవన్ కల్యాణ్ కొన్ని రోజులు, గంటలు కూడా మిగిల్చరు. మైకు అందుకోగానే.. కులాల గోల మొదలెడతారు. పైగా ఆయన చేసే కులాల ప్రస్తావన చాలా చవకబారుగా ఉంటుంది.
ఇవాళ్టి రాజకీయంలో కులాల ప్రస్తావన అనివార్యం. అయితే ఇతర నాయకులు కులాల మీటింగుల్లో మాత్రమే వాటి ప్రస్తావన తెస్తారు. పవన్ వేదిక ఏదైనా సరే.. కులాల గురించి కాపుకులం గురించి, బీసీ కులాల పేర్ల జాబితా చదివి వాటి గురించి మాట్లాడకుండా ఉండలేరు. ‘రెడ్డి కులం చేతిలోనే అధికారం ఉండాలా? ’ అని జగన్ మీద తన అక్కసు వెళ్లగక్కకుండా ఉండలేరు. అక్కడికేదో చంద్రబాబునాయుడును సీఎం చేయడం ద్వారా తాను నిమ్నకులాలకు అధికారాన్ని కట్టబెడుతున్నట్టుగా ఆయన బిల్డప్ ఇస్తుంటారు. ప్రతి చిన్న విషయాన్నీ కులం కోణంలోంచి చూస్తూ లేకిగా మాట్లాడే ఏకైక వర్తమాన రాజకీయనాయకుడిగా పవన్ కల్యాణ్ ముద్రపడ్డారు.
ఒక దశ శృతిమించి మతాల ప్రస్తావన కూడా తెస్తున్నారు. ముస్లిములతో మీటింగు పెట్టుకుని.. క్రిస్టియను గనుక మీరు జగన్ ను నమ్మి ఓట్లేశారు. కానీ మీరు బాగుండాలంటే.. నా వెంట ఉండండి.. నాకు ఓట్లేయండి అని చెప్పడం ఆయనకే చెల్లింది. నేను బిజెపి జట్టులో ఉన్నా సరే.. మీకు మేలు చేస్తాను అంటారు. ఈ దేశంలో 17 శాతం ఉన్న ముస్లింలు క్షేమంగా బతుకుతున్నారంటే.. అది బిజెపి యొక్క ఔదార్యమే అని అర్థం వచ్చేట్టుగా, అక్కడికేదో మెజారిటీ హిందూ మతస్తులు, మైనారిటీ ముస్లిం మతస్తుల మీద సానుభూతి చూపిస్తున్నట్లుగా పవన్ కల్యాణ్ మాట్లాడడం గర్హనీయం.
ప్రతి మాటలోనూ విద్వేషం వరదపోటెత్తుతుంటుంది. జగన్ ను నిందించడానికి ఆయన కులాల ఆసరా తీసుకుంటారు. ఆయన మాటల్లో అతివాగుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. తాను అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలను బాగుచేసేస్తా.. అనే పడికట్టు హామీలు తప్ప, నిర్దిష్టంగా ప్రజల కోసం ఏం చేస్తానో ఎప్పటికీ చెప్పలేని అసమర్థ నాయకుడు పవన్ కల్యాణ్.. వైసీపీని తిట్టడానికి మాత్రం అతిగా చెలరేగిపోతుంటారు.
బ్లాక్ మెయిలింగ్ మాటలు!
పవన్ కల్యాణ్ ప్రసంగాలు ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా ఉంటాయి. రాజకీయ నాయకుడు అనేవాడు.. మీరు నన్ను గెలిపించినా ఓడించినా మీ సేవలో ఉంటాను. నా జీవితాన్ని మీ సేవకు అంకితం చేసాను.. అనే మాటలు చెప్పడం సహజం. కానీ పవన్ పోకడలు వేరు. ‘ఇక మీదట ఏపీలోనే ఉంటా’ అనే డైలాగు వేస్తుంంటారు గానీ.. ప్రజలతో మాత్రం క్విడ్ ప్రోకో బేరాలు పెడుతుంటారు.
మీరు నన్ను సీఎం చేయండి. నన్ను గెలిపించండి.. నేను మీకు అండగా ఉంటా! ఇదొక్కటే ఆయనకు చేతనైన విద్య. గెలిపిస్తే అండగా ఉండడం అనేది పెద్ద గొప్పతనం ఏముంది? గాజువాకలో గెలిపించి ఉంటే.. విశాఖ కబ్జాలను అడ్డుకుని ఉంటానని చెప్పే పవన్ , ఓడించారు గనుక.. మీ చావు మీరు చావండని ప్రజలను వదిలేశారని అనుకోవాలా? ఈసారి కూడా అదే జరుగుతుందని అనుకోవాలా? మీరు నన్ను గెలిపిస్తేనే మీ వెంట ఉంటానని అనడం ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ మాటలే అవుతాయి.
పవన్ కల్యాణ్.. జగన్ దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికి కంకణం కట్టుకుని చంద్రబాబునాయుడు పల్లకీ మోస్తున్నారు. మంచిదే. ఆయన బుద్ధి వికసించినంత మేరకు ఆయన ఆలోచనకు అదే మంచిదని అనిపిస్తుండవచ్చు. ‘‘నేను సీఎం అవుతా.. నేను సీఎం అవుతా..’’ అని సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు కదా..! అలాంటి ఆశ ఉండడాన్ని కూడా తప్పుబట్టలేం. మరి, జనసేన పార్టీ ఒంటరిగా పోటీచేస్తే, ఆయన పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఖచ్చితంగా గెలవగల ఇద్దరు నాయకుల పేర్లు ఉన్నపళంగా చెప్పగల స్థితిలో ఆయన ఉన్నారా? కనీసం ఆ మాత్రం బలం ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే, పార్టీ కేడర్ ఉంటే.. ఆయన సక్సెస్ ఫుల్ రాజకీయ నాయకుడు అవుతారని భావించవచ్చు.
..ఎల్. విజయలక్ష్మి