సేవ్ విశాఖ…. మళ్ళీ కలకలం

సేవ్ విశాఖ అంటూ పోస్టర్లు విశాఖలో ఎటు చూసినా ప్రత్యక్షం అవుతున్నాయి. విశాఖ నగరాన్ని రక్షించండి అమిత్ షా గారూ అంటూ పోస్టర్లు కనిపిస్తున్నాయి. విశాఖకు భద్రత కల్పించాలంటూ జన జాగరణ సమితి పేరుతో …

సేవ్ విశాఖ అంటూ పోస్టర్లు విశాఖలో ఎటు చూసినా ప్రత్యక్షం అవుతున్నాయి. విశాఖ నగరాన్ని రక్షించండి అమిత్ షా గారూ అంటూ పోస్టర్లు కనిపిస్తున్నాయి. విశాఖకు భద్రత కల్పించాలంటూ జన జాగరణ సమితి పేరుతో  ఈ విధంగా పలు పోస్టర్లు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. విశాఖకు ఏమైంది, ఇంతలో ఏమి వచ్చింది అన్న దాని మీద అంతా తర్కించుకుంటున్నారు. తెల్లారుతూనే వెలసిన ఈ పోస్టర్ల వెనక రాజకీయం ఏంటి ఆంతర్యం ఏమిటి అన్న దాని మీద కూడా ఆలోచిస్తున్నారు.

విశాఖ ప్రశాంత నగరంగానే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా రాజకీయ పార్టీలు నాయకులు ఇస్తున్న ప్రకటనలతో విశాఖలో నివసిస్తున్న సగటు జనాలు అవునా విశాఖలో భద్రత లేదా అని అనుకోవాల్సి వస్తోంది. పాతిక ముప్పయి లక్షల జనభాతో విశాఖ అను నిత్యం తన పనిలో తాను బిజీగా ఉంటుంది. ఈ స్మార్ట్ సిటీ ఎందరికో ఉపాధిని ఇస్తోంది. సాగర తీరం ఆనందాన్ని ఇస్తోంది. ఇక్కడకు వలస వచ్చిన రాజకీయ జీవులకు పదవులు ఇస్తోంది.

విశాఖ అంటే కూల్ అండ్ సేఫ్ అన్నది ఏనాడో స్థిరపడిపోయిన అభిప్రాయం. అలాంటి విశాఖకు ముప్పు ఉందని భయపెడుతుండడం చాలా కాలంగా సాగుతోంది. సునామీ విశాఖను ముంచెత్తుతుందని అప్పట్లో భయపెట్టారు, భూకంపాల జోన్ గా ఉందని సముద్రంలో విశాఖ సిటీ ఏదో రోజు కలసిపోతుందని ఫ్లాష్ బ్యాక్ కధలను చెప్పి వణికించారు.

ఇపుడు చూస్తే విశాఖలో ఏ ఒక్కరికీ భద్రత లేదని అంటున్నారు. విశాఖలో ల్యాండ్ మాఫియా, గంజాయి మాఫియా, మైనింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్స్, మర్డర్స్, కిడ్నాప్స్ అన్నీ ఉన్నాయని పోస్టర్లో రాసి విశాఖకు సేవ్ చేయండి అమిత్ షా గారు అని కోరుతున్నారు. ఈ మాఫియాలు ఉంటే ఈ రోజే లేవు, గతంలోనూ ఉన్నాయి. భవిష్యత్తులోనూ ఉంటాయి. ఏ నగరంలో అయినా నేరాలు లేని పరిస్థితి ఉండదు. అలాగని తెల్లారుతూనే రక్తాలు ఓడ్చే సిటీలు కూడా ఎక్కడా ఉండవు.

దీన్ని బట్టి చూస్తే అర్ధం అవుతోంది ఒక్కటే. ఇటీవల జరిగిన విశాఖ ఎంపీ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నాప్ ఇష్యూని ఫుల్ గా పొలిటికల్ గా వాడేసుకోవాలన్న తాపత్రయం. అంతే అంత కంటే మరేమీ ఇందులో కనబడదు, విశాఖ భద్రంగా లేకపోతే ఈ రోజుకీ మంది పేదలు ఆరు బయట గుండెల మీద చేయి వేసుకుని  ఆదమరచి నిద్రించే పరిస్థితి ఉండదు.

అర్ధరాత్రి అపరాత్రి చూడకుండా ఉద్యోగాలు చేసుకుంటూ ఎవరి ఇళ్ళకు వారు వెళ్లడం అంతకంటే జరగదు. కానీ భయపెట్టేస్తున్నారు, విశాఖను బదనాం చేసేటంతగా భయపెడుతున్నారు. ఏపీలో ఉన్న ఏకైక పెద్ద సిటీని తమ రాజకీయం కోసం బలిపెడితే అది ఏపీకి ఎంత వరకూ మేలు చేస్తుందో ఆలోచన లేకుండా భయపెట్టేస్తున్నారు.

రాజకీయమే అన్నింటికీ పరమావధి అయిన వేళ ఇలాంటివే జరుగుతాయి. లక్షల జనాభా ఉన్న విశాఖలో జనాలు వీటిని ఎపుడూ పట్టించుకోరు. విశాఖను రక్షించాలి అంటూ పోస్టర్లు వేయడమే పెద్ద తమషా. ఏ నగరాన్ని ఎవరు రక్షిస్తారు. కదిలే నదీ ప్రవాహం లాంటి ప్రజలను ఎవరు అదిలిస్తారు. అది జరిగే పనేనా. కానీ డిమాండ్లు విడ్డూరంగా ఉంటాయి. ఎవరి రాజకీయ ప్రయోజనం కోసమే ఇలాంటివి ప్రచారం చేస్తూ తృప్తి పొందుతున్న వారికి కూడా తెలుసు విశాఖకు ఏమీ కాలేదని, ఏమీ అవదని.