ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తన అన్న కాదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ కడప వేదికగా ప్రకటించారు. కడపలో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో షర్మిల ఆవేశంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి నామమాత్రం, తన వ్యక్తిగత గొడవపై ఎక్కువగా షర్మిల మాట్లాడారు. ప్రతి మీటింగ్‌లోనూ ఇదే తంతు. కాంగ్రెస్ ఎజెండా సంగతి దేవుడెరుగు, షర్మిల సొంత గొడవే ఆమెకు ముఖ్యమైందన్న విమర్శ లేకపోలేదు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సొంత జిల్లా, వైసీపీ కంచుకోట కడపలో షర్మిల మాట్లాడుతూ అన్నపై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. ఆయనతో రక్త సంబంధం ఉందన్నారు. అయితే సీఎం అయ్యాక జగన్ మారిపోయారని విమర్శించారు. ఇప్పుడున్న జగన్ తన అన్న కానే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ అన్నే కాదని అనుకుంటున్నప్పుడు ఇక పంచాయితీ ఏముందనే ప్రశ్న వైసీపీ నుంచి ఎదురవుతోంది. జగన్ అన్న కాదనుకున్నప్పుడు, కేవలం ప్రత్యర్థిగానే షర్మిల చూస్తున్నప్పుడు, ఇక సాక్షి మీడియాలో తన వాటా గురించి మాట్లాడ్డం ఏంటని వైసీపీ నిలదీస్తోంది. ఆస్తుల విషయానికి వచ్చే సరికి జగన్ అన్న అవుతారా? రాజకీయానికి వస్తే మాత్రం శత్రువా? ఇదెక్కడి పద్ధతి అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.
జగన్‌ను సాక్షిలో వాటా అడిగినట్టుగా లోకేశ్‌ను హెరిటేజ్‌లో భాగం అడుగుతుందేమో అని వైసీపీ నేతలు వెటకరిస్తున్నారు. తాను మాత్రం నిత్యం దుమ్మెత్తి పోస్తూ, తనను మాత్రం ఒక్క మాట కూడా అనకూడదని షర్మిల కోరుకోవడం విడ్డూరంగా వుందని వారు తప్పు పడుతున్నారు. ఏం పీక్కుంటారో పీక్కోండి లాంటి అభ్యంతరకర కామెంట్స్ మాట్లాడ్డంపై షర్మిల ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని హితవు చెబుతున్నారు.