జగన్ ఓడారు. అది కూడా ఘోరంగా దారుణంగా ఓడారు. దాంతో టీడీపీ తమ్ముళ్లకు తమ గెలుపు కంటే అది రెట్టింపు ఆనందం అవుతోంది. దాంతో ఎవరికి తోచిన విధంగా వారు జగన్ రాజకీయ జాతకం చెబుతున్నారు. జగన్ పార్టీకి ప్రతిపక్ష స్థానం కూడా అసెంబ్లీలో దక్కలేదు కాబట్టి ఆయన అసెంబ్లీకి రానే రారు అని తేల్చేస్తున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. జగన్ రాజకీయాలకు పనికిరారు అని ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి ఆయన రాజకీయాలకు స్వస్తి పలుకుతారు అని జోస్యం చెప్పారు.
మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అయితే రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలు శుభం కార్డు వేశాయని చెప్పేశారు. జగన్ ని ప్రజలు వద్దు అని మామూలుగా అనలేదని గట్టి తీర్పుతో స్పష్టం చేశాయని ఆయన అన్నారు.
జగన్ తన అయిదేళ్ళ పాలనలో ఎన్నో తప్పులు చేశారు కాబట్టి ఆయనకు త్వరలో జైలు జీవితం సంప్రాప్తిస్తుందని కూడా బండారు మరో జోస్యం వదిలారు. ఇలా చంద్రబాబుని ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతూ జగన్ కి మాత్రం రాజకీయాలే వద్దు అని అంటున్నారు.
దీని మీదనే వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. గెలిచారు సంతోషం. మీ పాలన ఏదో మంచిగా చేసి చూపించండి అంతే తప్ప జగన్ రాజకీయాల గురించి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. జగన్ రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న వారని ఆయన కచ్చితంగా ఈ ఓటమి నుంచి తేరుకుని గెలుపు దిశగా అడుగులు వేస్తారు అని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.