కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. దాంతో ఏపీలోని టీడీపీ ఎంపీల అవసరం వచ్చి పడింది. ఇపుడు ఏపీ అవసరాల గురించి గట్టిగా వాదించి పని చేయించుకోవడం మీదనే టీడీపీ టాలెంట్ ఆధారపడి ఉంది అని అంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ మెడ మీద బీజేపీ కత్తి పెట్టి మూడేళ్లుగా బలహీనం చేస్తోంది అని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఇపుడు సరైన సమయం వచ్చింది కాబట్టి బీజేపీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేసే శక్తి టీడీపీ ఎంపీలకు ఉందని అంటున్నారు.
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి మద్దతు ఇస్తున్న టీడీపీ- బీజేపీ అగ్ర నేతల నోటి వెంట స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయించబోమని ప్రకటన విడుదల చేయించాలని కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం విధానపరమైనది అని చెబుతూ వస్తున్న బీజేపీ ఇపుడు తన ప్రభుత్వానికే ఆధారంగా ఉన్న ఏపీ ఎంపీల కోరికను తప్పనిసరిగా తీర్చాల్సి ఉంటుందని అంటున్నారు.
అయితే అది టీడీపీ డిమాండ్ ఏ మేరకు చేయగలదు అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుందని కూడా చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేట్ అయి ఉంది.తాజా ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్ధిని ఏపీలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించారు.
దాదాపుగా 94 వేల ఓట్ల భారీ ఆధిక్యతతో టీడీపీ అభ్యర్ధి ఇక్కడ నెగ్గారు. ఒక విధంగా ఇది ప్రైవేటీకరణకు అనుకూలంగా చెప్పే ఓటేనా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెబుతున్న బీజేపీ ఉన్న కూటమికి మద్దతు ఇచ్చి భారీ స్థాయిలో గెలిపించడాన్ని ఎలా చూడాలి అన్నది కూడా మేధావులు తర్కించుకునే పరిస్థితి ఉంది.
స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రాంతంలోనే ప్రజలలో వ్యతిరేకత లేదు ప్రైవేటీకరణ చేసుకోవచ్చు అన్న సందేశం అంతర్లీనంగా వినిపించినట్లే కదా అని కూడా అంటున్నారు. అయితే టీడీపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతుందని నమ్మకంతో ఓటేశారని చెబుతున్న వారూ ఉన్నారు. దాంతో ఆ నమ్మకాన్ని టీడీపీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.