విశాఖ మేయర్ పీఠం దక్కించుకోవడానికి టీడీపీ కూటమి చూస్తోంది అని ప్రచారం సాగుతోంది. ఏపీలో సంపూర్ణ అధికారాన్ని దక్కించుకున్న టీడీపీ కూటమి ఏపీలో ప్రతిష్టాత్మకమైన విశాఖ కార్పోరేషన్ ని గెలుచుకోవాలని చూస్తోంది.
అయితే రెండున్నరేళ్లు అయింది కార్పోరేషన్ కి ఎన్నికలు జరిగి. వైసీపీ ఆనాడు అధికారంలో ఉండడంతో విశాఖ మేయర్ పీఠం దక్కింది. టీడీపీ కూడా 30కి తక్కువ కాకుండా కార్పోరేటర్లను గెలుచుకుంది. ఇపుడు చూస్తే మేయర్ పీఠం కాపాడుకోవడానికి సరిపడా కార్పోరేటర్లు వైసీపీకి ఉన్నారు.
కానీ వైసీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళడంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ లోని అసంతృప్తులను తమ వైపునకు లాగేసి విశాఖ కార్పోరేషన్ మీద కూటమి జెండా ఎగరేయడానికి పావులు కదుపుతున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది.
విశాఖ కార్పోరేషన్ లో బలాబలాలు చూస్తే కనుక జీవీఎసీలో 98 స్థానాలకు 97 మంది కార్పోరేటర్లు ఉన్నారు. వైసీపీకి 57 మంది, టీడీపీకి 29 మంది జనసేనకు 3, బీజేపీ, సీపీఐ, సీపీఎం లకు ఒక్కొక్కరుగా ఉన్నారు. మరో అయిదుగురు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు ఉన్నారు. విపక్షాల ఈ నంబర్ చూస్తే 40 దాకా ఉంది.
మేయర్ పదవిని అందుకోవడానికి మ్యాజికి ఫిగర్ 50 మంది ఉండాలి. మరో పది మందిని వైసీపీ నుంచి తిప్పుకుంటే మేయర్ పీఠం కూటమికి దక్కుతుంది అని లెక్క వేస్తున్నారు. వైసీపీలో ఉన్న అసంతృప్తులకు టచ్ లోకి వస్తున్నారు. ఇప్పటికే కూటమి నేతలు కార్పొరేషన్ లో టీడీపీ జెండా ఎగరవేస్తామని చెబుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు 2026లో జరుగుతాయి. సగం కాలం మిగిలి ఉంది. అధికార పార్టీలోకి జంప్ అయితే బాగుంటుంది అని వైసీపీలో ఆలోచించే వారి కోసం కూటమి అన్వేషిస్తోంది. అన్నీ కుదిరితే వైసీపీ మేయర్ ని మాజీ చేయడమే ఆలస్యం అంటున్నారు.