కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నుంచి సీఎం వైఎస్ జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు రవీంద్రనాథ్‌రెడ్డి గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో వైసీపీ హ్యాట్రిక్ కొట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దఫా అంత సీన్ లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
ఇదిలా వుండగా గత నాలుగు రోజులుగా ఆ నియోజకవర్గంలో జగనన్న టీమ్ పేరుతో ఓ టీమ్ సర్వే చేస్తోంది. కమలాపురం నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ వైసీపీకి విజయావకాశాలు, అలాగే ఎమ్మెల్యే పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజాభిప్రాయం వైసీపీకి షాక్ ఇస్తోందని తెలిసింది. వైఎస్ కుటుంబానికి పెద్ద సంఖ్యలో ఆ నియోజకవర్గంలో అభిమానులున్నారు. అయితే ఎమ్మెల్యే పనితీరుపై ఏ ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేయలేదని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
ఎంత సేపూ జగన్‌ను చూసి తనను గెలిపిస్తారనే ధీమాతో ఎమ్మెల్యే ఉన్నారని, పార్టీ కార్యకర్తలను, నాయకులను ఏ మాత్రం పట్టించుకోలేదని పెద్ద సంఖ్యలో సర్వే టీమ్ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా వీరపునాయునిపల్లె మండలంలోని సర్వరాయసాగర్ నుంచి నియోజకవర్గ ప్రజలకు సాగునీళ్లు అందించేందుకు ఏ మాత్రం కృషి చేయలేదనే అసంతృప్తి రైతాంగంలో వుంది. మరీ ముఖ్యంగా సర్వరాయసాగర్ చుట్టుపక్కల భారీ మొత్తంలో భూములను చౌకగా దక్కించుకుని చేపలు, రొయ్యల సాగు చేసుకుంటూ, సొంత వ్యాపారాల్లో మునిగిపోయి, ప్రజలను పట్టించుకోలేదనే ఆగ్రహం భారీగా వున్నట్టు తెలిసింది.
“ఎల్లారెడ్డినో, పుల్లారెడ్డినో చూడొద్దు. సీఎం జగన్‌ను చూసి మరోసారి వైసీపీకి ఓటు వేయండి” అంటూ పదేపదే ఆయన విజ్ఞప్తి చేస్తుంటారు. తనను రెండుసార్లు ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు ఫలానా మంచి పని చేశానని ఎన్నడూ ఆయన చెప్పుకున్న దాఖలాలు లేవు. తనపై భారీగా వ్యతిరేకత వుందని పసిగట్టిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, ఈ దఫా కుమారుడిని బరిలో దించాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కుమారుడు నరేన్ రామాంజనేయులరెడ్డి కూడా నియోజకవర్గంలో తండ్రికి, తనకు మధ్య ప్రజాదరణ ఎలా వుందనే అభిప్రాయ సేకరణలో ఉన్నారు.
తమ ఇద్దరిలో ఎవరు నిలబడితే మేలు అని నరేన్ స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తానికి జగనన్న టీమ్ సర్వేలో మాత్రం సీఎం మేనమామపై తీవ్ర వ్యతిరేకత రావడం చూసి షాక్‌కు గురవుతున్నారు. వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా వుంటే… మరి మిగిలిన నియోజకవర్గాల్లో ఎలా వుంటుందో ఊహించడానికే భయమేస్తోందని టీమ్ సభ్యుడొకడు అన్నట్టు ప్రచారం జరుగుతోంది.