వర్షాలు కురుస్తూ ఉండగా.. రోడ్లను మరమ్మతు చేయడం సాధ్యం కాదు. చేయడం వల్ల ఉపయోగం కూడా ఉండదు. రోడ్లు కొద్దిగా పొడిగా అయిన తర్వాత మాత్రమే ఎవరైనా మరమ్మతు చేయగలరు!
అయితే ఈ వాస్తవాన్ని పట్టించుకోకుండా.. ‘ఒకవైపు ఇంకా వర్షాలు కురుస్తూ ఉండగానే.. రోడ్ల దుస్థితిపై #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో ప్రభుత్వ వ్యతిరేక ఆన్ లైన్ ప్రచారాన్ని జనసేన ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. మూడురోజుల పాటు, అంటే వర్షాలు కురుస్తూ ఉన్నంత వరకు ఈ పోరాటం సాగుతుందని పవన్ స్వయంగా ప్రకటించారు.
ప్రజలు నిజంగా సమస్యను ఎదుర్కొంటూ ఉంటే గనుక, ప్రభుత్వం నిజంగా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే గనుక.. మూడురోజుల పోరాటం పరిష్కారం అవుతుందని పవన్ ఎలా అనుకున్నారో తెలియదు గానీ.. ఆయన దగ్గర ప్రస్తుతానికి అంతకు మించి టైం ఉన్నట్టు లేదు. ఎటూ వర్షాటు ఆగిపోయిన తర్వాత.. మరమ్మతు పనులు మొదలవుతాయి.. అవంతా తమ ఘనతే అని చాటుకోవడానికి పవన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే పవన్ కల్యాణ్ రాజకీయం మొత్తం.. షూటింగ్ గ్యాప్ లలో జరిగే వ్యవహారం మాత్రమే అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. ప్రజలకోసం సినిమాలను పూర్తిగా వదిలేశానని ప్రకటించి.. ప్రస్థానం ప్రారంభించిన పవన్ కల్యాణ్, ఆ తర్వాత.. ఎన్నికల్లో ఓడిపోయాక, తన బతుకు తెరువుకు సినిమాలు అవసరం కదా అంటూ మళ్లీ షూటింగులు మొదలెట్టారు.
అంటే.. గెలిచి ఉంటే.. బతుకు తెరువుకు రాజకీయాల్లో సినిమాలను మించి సంపాదించుకోవచ్చునని అనుకున్నారో ఏమో తెలియదు. చివరికి ఆయన పార్టీ నాయకులతో సమావేశాలు పెట్టుకున్నా సరే.. షూటింగ్ లొకేషన్లో షాట్ షాట్ కీ మధ్య గ్యాప్ లో పెట్టుకోవడం జరుగుతోంది. ఇదంతా టూమచ్ వ్యవహారంగా ఆయన పార్టీ వారే ప్రెవేటు సంభాషణల్లో అనుకుంటున్నారు.
అయితే.. ఇప్పుడు సినిమాల మధ్యలో నాల్రోజులు ఖాళీ దొరికితే.. సోషల్ మీడియా పోరాటం అంటూ పవన్ కల్యాణ్ రోడ్ల దుస్థితి మీద ఒక డ్రామా నడిపిస్తుండగా.. ఆయనకు కౌంటర్ గా సోషల్ మీడియాలో జగన్ అభిమానులు ఇంకో పోరాటానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ రాజకీయం అనేది షూటింగుల మధ్యలో మాత్రమే జరుగుతుంటుందని ఎద్దేవా చేసేలా.. #ShotOKPawanSir అనే హ్యాష్ ట్యాగ్ తో పవన్ వ్యవహారాలను, స్థిరత్వం లేని పోరాటాలను హేళన చేస్తూ సోషల్ మీడియా ప్రచారం సాగనుంది. వీరి పోటాపోటీ ప్రచారాల్లో నిజమైన ప్రజల నాడిని ఎవరు ప్రతిబింబిస్తారో చూడాలి.