కేసీఆర్‌పై సోము: గురివింద గింజ విమర్శలు!

ఆంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదట. ప్రతిఒక్కరిపై విమర్శలు చేసే కేసీఆర్‌కు అసలు జాతీయపార్టీ పెట్టే నైతిక హక్కు కూడా లేదట! ఈ మాటలు…

ఆంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదట. ప్రతిఒక్కరిపై విమర్శలు చేసే కేసీఆర్‌కు అసలు జాతీయపార్టీ పెట్టే నైతిక హక్కు కూడా లేదట! ఈ మాటలు అన్నదెవరో తెలుసా.. ఏపీ కమలదళ సారధి సోము వీర్రాజు! కేసీఆర్‌ .. భారత్ రాష్ట్ర సమితిని ప్రారంభించి.. మోడీ సర్కారు మీద డైరెక్ట్ ఎటాక్ కు దిగుతున్న నేపథ్యంలో ఏపీ నుంచి కమలదళం తరఫున సోము వీర్రాజు కూడా నోరు చేసుకుంటున్నారు. 

రాష్ట్ర విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్ కు కేసీఆర్ తీరిన అన్యాయం చేశారు సరే.. ఆ నష్టాన్ని పూడ్చడానికి విభజన చట్టం చాలాచాలా సదుపాయాలే కల్పించింది. కేసీఆర్ పాత్ర విభజన నాటితోనే అయిపోయింది. ఆ తర్వాత ఇప్పటిదాకా ఏపీ ఎలాంటి ఎదుగూ బొదుగూ లేకుండా కునారిల్లుతుండడానికి కీలకమైన పాత్ర ఎవరిది? సాధారణంగా అందరూ ఒక వేలు ఎదుటివాడి తప్పులెన్నడానికి చూపిస్తే గనుక.. మూడువేళ్లు నీ వైపే చూపిస్తుంటాయి అనే సంగతి తెలుసుకోవాలని అంటూ ఉంటారు. కానీ సోము వీర్రాజు విషయానికి వస్తే.. ఒక వేలును ఆయన కేసీఆర్ వైపు చూపిస్తే.. కొన్ని లక్షల వేళ్లు సోము వీర్రాజువైపు చూపిస్తుంటాయి.. అనే సంగతి ఆయన గ్రహించకపోతే ఎలాగ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేసీఆర్ చేసిన అన్యాయం ఎంత..? బిజెపి సారథ్యంలోని కేంద్రప్రభుత్వం చేసిన అన్యాయం ఎంత? నిజానికి బిజెపి చేసినది అన్యాయం కాదు.. ద్రోహం అనే చింతన ఏపీ ప్రజల్లో ఉంది. ఏపీకి ప్రత్యేకహోదా గురించిన చర్చ విభజన చట్టం చర్చ సందర్భంలో పార్లమెంటులో.. పదేళ్లపాటు ఇవ్వాలని డిమాండ్ చేసినది బిజెపి. ప్రత్యేకహోదా అనేదని అయిదేళ్లు ఏం సరిపోతుంది.. పదేళ్లపాటు ఇస్తాం అని.. ఏపీలో ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇచ్చిన వ్యక్తి నరేంద్రమోడీ. అక్కడినుంచి ఎన్నేసి ద్రోహాలకుపాల్పడ్డారో లెక్కేలేదు. 

ప్రత్యేకహోదాను పూర్తిగా మంటగలిపేశారు. విశాఖ రైల్వేజోన్ ఇస్తున్నాం అని ఇప్పటిదాకా ఊరిస్తూ మడమ తిప్పుతున్నారు. రాష్ట్రానికే తల మానికమైన విశాఖఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడానికి కుట్రలు చేస్తున్నారు. ఇన్ని రకాలుగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి ద్రోహం మీద ద్రోహం చేస్తూ ఉంటే.. కేసీఆర్ కు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు అని సోము వీర్రాజు సన్నాయి నొక్కులు నొక్కడమే తమాషా. 

ఏపీకి ప్రత్యేకహోదా సాధించి తెచ్చే వరకు, విశాఖ రైల్వేజోన్ ను సాధించి తెచ్చే వరకు.. ఎన్ని నయవంచన మాటలు చెప్పినా సరే.. ఏపీ ప్రజలు తమ పార్టీని ఆదరించరు అని కాషాయదళం తెలుసుకోవాలి. సోము వీర్రాజు కూడా వ్యూహాలు మార్చుకోవాలి.