అందరికీ చంద్రబాబుకు ఉన్నంత అదృష్టం ఉండదు. ఆయన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, ఆయన స్వయంగా స్థాపించిన పార్టీని హస్తగతం చేసుకుంటే.. దానిమీద న్యాయపరంగా సకలహక్కులూ ఆయనకే లభించాయి. తెలుగు ప్రజలు అలవాటు పడిన సైకిలు గుర్తుకూడా అప్పనంగా కలిసి వచ్చింది. కానీ అందరికీ అంత అదృష్టం ఉండదు.
మహారాష్ట్రంలో శివసేన చీలిపోయింది. కానీ శివసేన అనే పేరు, విల్లంబులు గుర్తు ఎవరికి చెందుతుంది? అనేది మాత్రం ఇంకా తేలలేదు. పార్టీ మీద సకల హక్కులు మాకంటే మాకే అని ఉద్ధవ్ ఠాక్రే, గోపీనాధ్ శిందే వర్గాలు ఇంకా కొట్టుకుంటున్నాయి. ఇందులో ట్విస్టు ఏంటంటే.. నవంబరులో తూర్పు అంధేరి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతుండగా.. ఎన్నికల సంఘం పార్టీ గుర్తును ప్రస్తుతానికి నిలిపేసి.. ఈ రెండు వర్గాలు కూడా విడివిడిగా వేరే పేర్లతో, వేరే గుర్తులతో ఈ ఎన్నికల్లో పోటీచేయాలని మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. ఇరు పార్టీలకు ఈసీ షాక్ ఇచ్చినట్టుగా అందరూ అనుకుంటున్నారు గానీ.. నిజానికి ఠాక్రే వర్గానికి మాత్రమే ఈ తీర్పు పెద్ద షాక్!
శివసేన లాంటి ప్రజలకు అలవాటు అయిన పార్టీ నాయకులు.. పార్టీ ఫిరాయించకుండా అదే పార్టీ పేరు చెప్పుకుంటూ వేరే గుర్తు మీద పోటీచేయడం అంటే కామెడీగా ఉంటుంది.పైగా శివసేన అంటే ప్రజల్లో ఒక అభిమానం ఉంటుంది. దాన్ని తమకు అనుకూలంగా పొందకుండా.. వ్యక్తులు వేరే కొత్త పార్టీ పేరు మీద కొత్త గుర్తుతో పోటీచేయడం అంటే.. వారికి గల అసలు ప్రజాబలం ఏమిటో బయటపడిపోతుంది. వారికి అనుకూలంగా ప్రచారం చేసినందుకు ఠాక్రే, శిందేలకు ఉన్న అసలు ప్రజాబలం కూడా బయటపడిపోతుంది. ఇది శివసేన సిటింగ్ సీటు. 2019 ఎన్నికల్లో బిజెపితో పొత్తుల్లో ఉండి ఈ సీటును గెలుచుకుంది.
శివసేన తరఫున 2019లో రమేష్ లట్కే ఎమ్మెల్యేగా గెలిచారు. తమాషా ఏంటంటే.. బిజెపి నాయకుడు ముర్జి పటేల్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేసి 17వేల ఓట్ల తేడాతో రెండోస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ ది అక్కడ మూడో స్థానం. ఈ ఏడాది మేలో రమేష్ లట్కే మరణించడంతో ఉప ఎన్నిక వచ్చింది.
అయితే మరణించిన రమేష్ లట్కే భార్య రుతుజా లట్కే ను తమ అభ్యర్థిగా ప్రకటించి శివసేన పేరుతోనే ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఇప్పటికే అక్కడ ప్రచారంలో దూసుకెళ్తోంది. గోపీనాధ్ శిందే వర్గం.. విల్లంబులు గుర్తు తమకు అర్జంటుగా కేటాయించాలని, ఉప ఎన్నిక నేపథ్యంలో తీర్పు అవసరం అని ఈసీని ఆశ్రయించింది. ఉద్ధవ్ ఠాక్రే అభిప్రాయాలను కూడా విన్నటువంటి ఈసీ.. ప్రస్తుతానికి ఇద్దరినీ విడివిడిగా పోటీచేసుకోమని తీర్పు ఇచ్చింది.
కానీ ఈ తీర్పు ఠాక్రేకు పెద్ద దెబ్బ. ఆయన ఆల్రెడీ మరణించిన రమేష్ లట్కే భార్య రుతుజను బరిలోదించి ప్రచారంలో ముందుకెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో విల్లంబులు గుర్తు లేకపోవడం అంటే షాక్! అదే సమయంలో గోపీనాధ్ శిందేకు ఇబ్బందేమీ లేదు. ఆయన వర్గం తరఫున అక్కడ ఎవరినీ పోటీకి దించడం లేదు. గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన బిజెపి తిరుగుబాటు అభ్యర్థి ముర్జిపటేల్ ఇప్పుడు బరిలో దిగుతున్నారు.
ఈస్ట్ అంధేరి శివసేన సీటు అయినప్పటికీ.. శిందే వ్యూహాత్మకంగా దానిని బిజెపికి అప్పగించారు. ఆపార్టీ గెలిస్తే అధికార కూటమిలో ఓ సీటు పెరుగుతుంది. ఓడితే.. సంఖ్యాపరంగా నష్టంలేదు. పైగా శిందే వర్గానికి జనాదరణ లేదు అనే ప్రచారానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఈలోగా ఎటూ విల్లంబులు గుర్తు ఎవరికి దక్కుతుందో ఎన్నికల సంఘం తేలుస్తుంది. అంటే శిందే సేఫ్ గేమ్ ఆడుతున్నారన్నమాట.
ఈ ప్రతికూలతలను తట్టుకుని, అధికారికి విల్లంబులు గుర్తు లేకపోయినా సరే.. రుతుజ లట్కే ను గెలిపించుకోగలిగితే.. ఉద్ధవ్ కు మరింత నైతిక బలం కూడా వస్తుంది. ఇదంతా గమనిస్తోంటే.. అప్పట్లో చంద్రబాబునాయుడు ఎంత సునాయాసంగా మామకు, పార్టీని స్వయంగా స్థాపించిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారిక పార్టీ గుర్తును ఎంత చాకచక్యంగా దక్కించుకున్నాడో కదా అనిపిస్తుంది.