చిరంజీవి అంటే తెలియని తెలుగువాడు ఉండడు. ఆయన కీర్తి, తేజస్సు ఎంతటివంటే ఆయనకున్న అభిమానులు పదేళ్ల నుంచి 90 ఏళ్లవాళ్లవరకు ఉన్నారు. అది అంత తేలిగ్గా వచ్చింది కాదు. ఎన్నో ఇబ్బందులు తట్టుకుని, ఎంతో కృషి చేసి, ఎన్నో సందర్భాల్లో సంయమనం పాటిస్తే ఆ స్థాయికి వెళ్లారాయన. ఆయన ముమ్మాటికీ గౌరవనీయులే. అందులో ఏమీ సందేహం లేదు.
అయితే చిరంజీవిలో ఉత్తమగుణాలు గుబాళిస్తున్నాయని అనుకునే లోపే ఆయనలో కొన్ని దుర్గుణాలు కూడా పేరుకుపోయి ఉన్నాయేమో అనిపిస్తోంది. ఆయనలో నిజంగా వినయసంపద ఉందా లేక కెమెరాల ముందు మాత్రమే ఆయన వినయప్రదర్శన చేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి చాలామందికి.
ఇప్పటికీ మండుతున్న గరికిపాటి వివాదానికి చిరంజీవి తెరదించే ప్రయత్నం చేస్తున్నట్టు లేదు. ఆయన మీద ఇష్టంతో తన అభిమానులు గరికిపాటిని విమర్శస్తుంటే ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది ఆయన వ్యవహారశైలి. ఆయన నిశ్శబ్దం అభిమానులకి మరింత ఉత్సాహాన్నిచ్చి గరికిపాటిని ఇంకా విమర్శించేలా చేస్తోంది. ఇక్కడ గరికిపాటివారు చేసింది సరైనపని అనట్లేదు. ఆయనని అదేపనిగా మూడు రోజులుగా విమర్శిస్తుంటే చిరంజీవి ఖండించకపోవడం, ఆపకపోవడం బాగాలేదని చెప్పాల్సొస్తోంది.
ఒక్కసారి గతంలోకి వెళ్దాం. చిరంజీవిలో ఒక గుణముంది. అదేమిటంటే ఆయనని ఎవరైనా విమర్శిస్తే వెంటనే తిప్పికొట్టలేరు…కానీ వేరే ఎవరైనా ఆ వ్యక్తిని వెక్కిరించినా, నిందించినా విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఇదేదో ఊహించి చెప్తున్నది కాదు. దీనికి వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి. 2006లో చిరంజీవికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఒక వేడుక జరిగింది. ఆ వేడుకకి మోహన్ బాబు ఒక అతిథి. చిరంజీవి గురించి కాస్త అమర్యాదకరంగా వేదికెక్కి మాట్లాడాడు. చిరంజీవి నొచ్చుకున్నారు. ఆయన అవమానాన్ని ముఖంలో దాయలేరు. ప్రస్ఫుటంగా కనిపించేస్తుంది. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ వేదికెక్కి “తమ్ముడూ! మోహన్ బాబు..” అంటూ స్పీచ్ మొదలుపెట్టాడు. అంతే చిరంజీవి ఆనందానికి అవధుల్లేవు. కౌంటర్లేస్తూ సోదరప్రేమని చాటుకుంటూ మోహన్ బాబుకి ముచ్చెమట్లు పట్టి మొహం చిన్నబోయేలా ప్రసంగించాడు పవన్ కళ్యాణ్. ఆ సమయంలో చిరంజీవి తమ్ముడికి ప్రోత్సాహాన్నిచ్చేలా ప్రవర్తించి కుదుటపడ్డారు. ఇది దాదాపు 16 ఏళ్ల క్రితం నాటి మాట.
తర్వాత కాలక్రమంలో ఖైది 150 సమయంలో ఆర్జీవి ఆ సినిమా పోస్టర్స్ ని ట్వీట్ చేస్తూ వెటకారంగా కొన్ని ట్వీట్స్ పెట్టారు. అప్పుడు నాగబాబు ఆర్జీవిని అక్కుపక్షి అని వేదిక మీదే తిట్టారు. మరొక సందర్భంలో చిరంజీవి గురించో, రామచరణ్ గురించో చులకనగా మాట్లాడారని యండమూరిపై కూడా నాగబాబు విరుచుకుపడ్డారు. ఆ రెండు సందర్భాలని తర్వాత వివిధ ఇంటర్వ్యూస్ లో ప్రస్తావిస్తూ నాగబాబు కోపాన్ని సమర్ధించారు చిరంజీవి.
ఆ సందర్భాల్లో చిరంజీవి పట్ల ఎవరికీ ఎటువంటి కంప్లైంటూ లేదు. ఆయా వ్యక్తులు మోహన్ బాబు, ఆర్జీవి, యండమూరి కాబట్టి చిరంజీవి స్పందన కరక్టే అనుకున్నారు.
కానీ ఇప్పుడు వ్యవహారం గరికిపాటి నరసింహారావు. ఆయనకి సంఘంలో గౌరవం ఉంది. ప్రవచనకారులు కూడా. ఆయన క్షణికావేశం తప్పే అయినా అది మరీ అంత క్షమించరాని నేరం కాదు. పైన చెప్పుకున్న వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా చిరంజీవిని అవమానించారు. కనుక వాళ్లని ఏ స్థాయిలో విమర్శించినా ఎవ్వరూ తప్పుపట్టలేదు. గరికిపాటివారి ఉద్దేశ్యంలో చిరంజీవి పట్ల అగౌరవం లేదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి వినాలనే ఆత్రుత, అది జరక్కుండా ఆయనతో అభిమానుల ఫొటో సెషన్స్ ఆపుతున్నాయనే బాధ, చిరంజీవి సభ ప్రారంభంలోనే ఆయనకి దండం పెట్టి మర్యాద చాటారు కాబట్టి ఆయన్నే పేరు పెట్టి పిలవచ్చొనే చొరవ….అన్నీ కలిపి ఆయనను తొందరపడేలా చేసాయి.
అందుకే మొదట నాగబాబు గరికిపాటివారిని ఉద్దేశిస్తూ ఒక వెటకారపు ట్వీట్ చేసినా మర్నాడే తనని తాను సవరించుని ..ఏదో మూడ్ లో ఆయన అలా ప్రవర్తించారు తప్ప వేరే దురుద్దేశమేది ఆయనకు లేదని..కనుక వదిలేయమని అభిమానులకి విజ్ఞప్తి చేస్తున్నానని ట్వీట్ పెట్టారు.
కానీ ఆగుతున్నారా? గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్లో అనంత శ్రీరాం కూడా రెచ్చిపోయి “గరిక-మంత్రం” అంటూ ఏదో కథ చెప్పి మానుతున్న గాయాన్ని కెలికే ప్రయత్నం చేసాడు. అతని స్థాయికి ఇది అనవసరం. చిరంజీవి ప్రాపకం కోసం ఈ టాపిక్ ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎంత నేరుగా పేరు ఎత్తకపోయినా అందరికీ అర్థమయ్యే అంశమే అది. అలాగే దర్శకుడు బాబీ కూడా పరోక్షంగా ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకుని తన ప్రసంగంలో ప్రస్తావన తెచ్చారు.
గరికిపాటివారిని అందరూ విమర్శిస్తున్న విషయం నిజమే కానీ అనంతశ్రీరాం, బాబీ లాంటి చిరంజీవి కులస్థులు విమర్శిస్తున్నప్పుడు అక్కడ కులం రంగు కూడా అంటుకుంటుంది. కనుక జాగ్రత్త పడాల్సిన అవసరముంటుంది.
తన కళ్లముందే ఇంత జరుగుతున్నా చిరంజీవి వీళ్లనెవర్నీ ఖండించపోవడం, మందలించకపోవడం కొత్త అనుమానాలకి తావిస్తోంది. ఆయన ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నారా అనిపిస్తోంది. గరికిపాటివారిని తన విషయంలో ఇంతమంది వేలెత్తి చూపుతుంటే పెద్దమనసుతో ఆపొచ్చుకదా. ఆయనకీ ట్విటర్ అకౌంట్ ఉంది కదా! నాగబాబు ట్వీట్ పెట్టగా లేనిది ఈయన పెట్టడానికి అడ్డమేమిటి?
ఒక్కసారిగా చిరంజీవి “ఇక ఆపండి. గరికిపాటివారి విషయంలో నేనేం నొచ్చుకోలేదు. మీరెందుకు ఎక్కువ చేస్తున్నారు?” అని ఒక్కమాటంటే మెగాస్టార్ స్థాయి ఎంత పెరిగిపోతుంది? అలా కాకుండా గరికిపాటిని కూడా మోహన్ బాబు, ఆర్జీవి, యండమూరి తో సమానంగా ట్రీట్ చేస్తే ఎలా చిరంజీవిగారు!
– శ్రీనివాసమూర్తి