సరిగ్గా ఎన్నికల వేళ విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడే దిశగా పయనిస్తోందన్న ఆందోళన కార్మిక లోకం నుంచి వ్యక్తం అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది అని అంటున్నారు. రోజుకు దాదాపుగా పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల టన్నులు ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్ లో ప్రస్తుతం ఆరు టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది చెబుతున్నారు.
స్టీల్ ప్లాంట్ లో కోక్ ఓవెన్ లకు అవసరమైన కోకింగ్ కోల్ లేకపోవడంతో విశాఖ ఉక్కు పరిస్థితి ఎన్నడూ లేని విధంగా ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ పక్కనే ఉన్న గంగవరం పోర్టు కార్మికులు సమ్మెలో ఉన్నారు. దాని వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ కి కోకింగ్ కోల్ అందడం లేదు. రెండు షిప్పులలో దిగుమతి చేసుకున్న కోకింగ్ కోల్ అలాగే గంగవరం పోర్టు వద్ద నిలిచిపోయింది.
ఈ పరిణామంతో స్టీల్ ప్లాంట్ లోని కోక్ ఓవెన్ లో 320 పుష్షింగ్స్ చేయాల్సి ఉండగా 140 పుష్షింగ్స్ తోనే స్టీల్ ప్లాంట్ నడుస్తోంది. ఈ పుష్షింగ్స్ కనీసంగా 270 దాకా ఉండాలని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు అంటున్నాయి. దాంతో సరిపడా కోకింగ్ ఓవెన్ లేకపోవడంతో ఏ క్షణం అయినా బ్యాటరీలు డౌన్ అయిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
స్టీల్ ప్లాంట్ కి రోజుకు తొమ్మిది వేల ‘టన్నుల కోకింగ్ ఓవెన్ అవసరం అయి ఉంటే కేవలం నాలుగు వేల టన్నులతోనే ప్రస్తుతం నడుపుతున్నారు. బ్యాటరీలు డౌన్ కాకుండా స్టీల్ ప్లాంట్ లో అతి పెద్ద కసరత్తునే చేస్తున్నారు. అయితే ఉక్కులో ఇంధనంగా ఉపయోగించే కోక్ గ్యాస్ ఉత్పత్తి కూడా తగ్గిపోయింది అని అంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కి ముడి సరుకు లోటు ఒక వైపు ఉంటే వంద కోట్ల బకాయిలు తక్షణం చెల్లించాలంటూ ప్లాంట్ కి విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో ప్లాంట్ ని పాలకులు శ్రద్ధ తీసుకుని కాపాడాలని కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా ఉండడం ఎన్నికల వేళ కనుక ప్లాంట్ లో ఏమైనా జరిగితే ఉక్కు విస్పోటం రాజకీయంగా ఏ పార్టీని భస్మీపటలం చేస్తుందో అన్నది కూడా హాట్ డిస్కషన్ గా ఉంది.