బీఫామ్ సాధించిన బీజేపీ నాయకుడు భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ … ఎన్నికల్లో విజయం సాధించినంతగా సంబరపడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ సీటుపై అనేక రకాల ప్రచారాలు జరిగాయి. ఈ సీటును సిటింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆశించారు. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించారు. నరసాపురం నుంచి మరోసారి తానే పోటీ చేస్తున్నట్టు తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జనసేన-టీడీపీ సభలో రఘురామకృష్ణంరాజు తనకు తానే ప్రకటించుకున్నారు.
ఢిల్లీ వేదికగా రాజకీయాలు నడిపే రఘురామకు ఏదైనా స్పష్టమైన హామీ లభించిందేమో అని అంతా అనుకున్నారు. నరసాపురం సీటును బీజేపీకి కేటాయించడంతో, ఆ పార్టీ తరపున టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నించారు. అసలు బీజేపీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేని ఆయన నరసాపురం సీటు కోసం లాబీయింగ్ చేశారు. టికెట్ సాధించేంత పలుకుబడి ఆయనకు వుంది.
ఎందుకో గానీ, రఘురామకు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. తనకు టికెట్ దక్కకపోవడానికి ఫలానా వాళ్లే కారణమని రఘురామ తన సహజ ధోరణిలో విమర్శలు గుప్పించారు. చివరికి ఆ సీటును బీజేపీ నిఖార్సైన కార్యకర్త భూపతిరాజు శ్రీనివాస్‌వర్మకు కేటాయించారు. అయినప్పటికీ రఘురామకే ఆ సీటు ఇప్పించేందుకు చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేశారనే వార్తలొచ్చాయి.
ఇదిగో నేడో, రేపో నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా రఘురామను ప్రకటిస్తారని కూడా చెప్పారు. చివరికి శ్రీనివాస్‌వర్మకే బీజేపీ బీఫామ్ ఇవ్వడం విశేషం. ఎన్నెన్నో ప్రచారాల మధ్య బీఫామ్ దక్కించుకున్న శ్రీనివాస్ వర్మ… ఎన్నికల్లో విజయం సాధించినంతంగా సంబరపడుతున్నారు. రఘురామను దాటుకుని టికెట్ దక్కించుకోవడం గొప్ప విజయమని ఆయన భావిస్తున్నారు. బీజేపీలో భూపతిరాజు వర్మ ఎంత బలంగా ఉందో రుజువైంది. ఇక ఎన్నికల ఫలితం ఎలా వుంటుందో చూడాలి.