హ్యాపీ డేస్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. సెన్సిబుల్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న కమ్ముల, హ్యాపీడేస్ కు సీక్వెల్ తీయాలని ప్లాన్ చేశాడట.
“ఇన్నేళ్లయినా మళ్ళీ మళ్ళీ కాలేజీకి పోవాలి.. మళ్ళీ సినిమా చూడాలి అనిపించేలా ఆ సినిమా ఉంటుంది. సంగీతం కూడా చాలా బాగుంటుంది. సినిమాలో ఏదైనా ఔట్ డేట్ అవుతుందేమోనని మొన్ననే మళ్లీ చూశాను. అంతే ఫ్రెష్ గా ఉంది. ఒక టైమ్ లో ఈ సినిమాకు సీక్వెల్ చేద్దాం అనుకున్నాను. కానీ కథ రూపుదాల్చుకోలేదు.”
హ్యాపీ డేస్ సీక్వెల్ కు కథ ఎందుకు సెట్ అవ్వలేదో కూడా చెప్పుకొచ్చాడు కమ్ముల. అప్పటికీ ఇప్పటికీ కాలంలో, టెక్నాలజీలో చాలా మార్పులొచ్చాయని అంటున్నాడు.
“హ్యాపీడేస్ సినిమా చేస్తున్నప్పుడు నా గ్రాడ్యుయేషన్ పూర్తయి పదేళ్ళు అయింది. కానీ ఇప్పటికీ చూసినా కరెక్టే అనిపించేలా ఉంది. స్టూడెంట్ బ్యాక్ గ్రౌండ్ అప్పటి పరిస్థితులకు సెట్ అయింది. ఇప్పుడు సెట్ అవ్వదు. టెక్నాలజీ మారింది. ప్రతి స్టూడెంట్ చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి. కోవిడ్, గ్లోబలైజేషన్ వంటి పరిస్థితుల తర్వాత ఆలోచన విధానం మారింది. టెక్నాలజీపరంగా ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరి లోకంలో వారు ఉన్నారు.”
ఇలా పరిస్థితులు, టెక్నాలజీ మారడం వల్ల హ్యాపీడేస్ పార్ట్-2కు కథ సెట్ అవ్వలేదని చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్ముల. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు కథ రాసుకోవచ్చు కానీ, ఇంకా ఏం అనుకోలేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు ధనుష్, నాగార్జున హీరోలుగా కుబేర అనే సినిమా చేస్తున్నాడు.