బాబు స్క్రిప్టునే వండించడం అంత వీజీ కాదు!

చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా.. సుప్రీం కోర్టు తీర్పు వెలువడింది. తిరుమలేశుని లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువ్యర్థాలు, కొవ్వుల కల్తీ జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర సభ్యుల సిట్…

చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా.. సుప్రీం కోర్టు తీర్పు వెలువడింది. తిరుమలేశుని లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువ్యర్థాలు, కొవ్వుల కల్తీ జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర సభ్యుల సిట్ ఉండాలని సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో తాము అనుకున్నదే జరగాలని, తమ స్క్రిప్టు ప్రకారం తమకు కిట్టని వారిని ఇరికించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు కాలం చెల్లినట్టయింది.

కాకపోతే.. రాష్ట్ర పోలీసు విభాగం నుంచి ఇద్దరు అధికారులు మాత్రం సుప్రీం ఆదేశించిన సిట్ లో సభ్యులుగా ఉంటారు. సీబీఐ నుంచి మరో ఇద్దరు అధికారులు ఉంటారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి కూడా సిట్ సభ్యులుగా ఉండాలని సుప్రీం సూచించడం విశేషం.

లడ్డూ కోసం వాడే నెయ్యి కల్తీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తున్న ఆరోపణలు, వేస్తున్న నిందలు తొలి నుంచి అనుమానాస్పదంగానే ఉన్నాయి. టీటీడీ నెయ్యిని ల్యాబ్ పరీక్షలకు పంపితే.. ఆ రిపోర్టులను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో వెల్లడించడమే తొలి ‘అతి’గా పలువురు భావిస్తున్నారు. కేవలం కల్తీ జరిగింది.. అనే ఆరోపణలతో ఊరుకోకుండా.. పందికొవ్వు, గొడ్డు కొవ్వు వంటివి కలిశాయని ప్రత్యేకించి చేసిన ఆరోపణలు ఇవన్నీ కలిసి సందేహాలకు ఊతమిచ్చాయి.

కల్తీ జరిగిందనే మాట బయటపెట్టినప్పటి నుంచి తెలుగుదేశం దళాలన్నీ కూడా ప్రత్యేకించి కొందరు వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నట్టుగా విమర్శలు ప్రారంభించారు. నెయ్యి కల్తీ జరిగిందో లేదో పరీక్షల్లో, దర్యాప్తులో తేలుతుంది. కానీ, జగన్ సహా కొందరు వైసీపీ నాయకుల పరువు తీయడం లక్ష్యంగా వీరి విమర్శలు సాగాయి.

ప్రభుత్వాధినేత అయిన చంద్రబాబు ఒకవైపు ఫలానావాళ్లు తప్పు చేశారని ప్రెస్ మీట్ లలో నిందలు వేస్తూ.. మరొకవైపు తన కింద పనిచేసే పోలీసులనే సిట్ గా దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేయడం విమర్శలకు దారితీసింది. వారు చంద్రబాబు స్క్రిప్టునే తమ నివేదికగా ఇస్తారనే భయాలు పలువురిలో వ్యక్తం అయ్యాయి.

వైవీ సుబ్బారెడ్డి, సుబ్రమణ్యస్వామి తదితరులు సుప్రీంలో కేసు వేయడంతో.. న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ సిట్ విచారణను మూడు రోజుల కిందటే ఆపుచేయించింది. తాజాగా స్వతంత్ర సిట్ తో దర్యాప్తు చేయించాలని నిర్ణయించారు. ఈ తీర్పు తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడుకు అశనిపాతం కావొచ్చు. తాము తయారుచేసే స్క్రిప్టు ప్రకారం దర్యాప్తు నివేదికలు తయారుచేయడం సాధ్యం కాదని వారు బాధపడవచ్చు.

మొత్తానికి నెయ్యి కల్తీ వివాదం మొదలైనప్పటి నుంచి.. నిందలు భరిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు ఏకపక్షంగా సాగుతుందేమోననే భయంతో ఉన్న వారికి ఊరట కలిగిస్తూ సుప్రీం తీర్పు వెలువడిందనే చెప్పాలి.

5 Replies to “బాబు స్క్రిప్టునే వండించడం అంత వీజీ కాదు!”

  1. తనకి సిఐడితో స్కిల్ లో అనుభవం ఉంది కదా అందరూ అలాగే చేస్తారనే భ్రమలో ఉన్న అన్నయ్య..

Comments are closed.