Swag Review: మూవీ రివ్యూ: శ్వాగ్

పాత్రలు ఎక్కువైపోవడం, వాటి మధ్య ఎమోషన్స్ పండకపోవడం, కామెడీ లేకపోవడం శ్వాగ్ సినిమా ప్రధాన లోపాలు.

చిత్రం: శ్వాగ్
రేటింగ్‍: 2.25/5
బ్యానర్‍: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
తారాగణం: శ్రీవిష్ణు, రీతూవర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, సునీల్, గోపరాజు రమణ, రవిబాబు తదితరులు..
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: వేదరామన్ శంకరన్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
కథ- దర్శకత్వం: హసిత్ గోలి
విడుదల తేదీ: అక్టోబర్ 4, 2024

రాజరాజచోర లాంటి మంచి సినిమా తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కలిసి చేసిన సినిమా శ్వాగ్. మరి వీళ్ల రెండో ప్రయత్నం ఫలించిందా? అసలు ఏ టార్గెట్ తో శ్వాగ్ తీశారు.. ఆ లక్ష్యాన్ని అది అందుకుందా? ఈ ఏడాది ది బెస్ట్ ఇంటర్వెల్, ది బెస్ట్ క్లయిమాక్స్ అంటూ మేకర్స్ చెప్పిన రేంజ్ లో ఈ సినిమా ఉందా..? చూద్దాం..

“స్త్రీ-పురుష సమానత్వమే అసలైన ప్రజాస్వామం.” శ్వాగ్ సినిమా చివర్లో దర్శకుడు వేసిన కార్డు ఇది. ఈ విషయం చెప్పడం కోసం అతడు వింజామర వంశాన్ని, శ్వాగణిక వంశాన్ని సృష్టించాడు. ఒకటి మాతృస్వామ్యం కాగా, ఇంకోటి పితృస్వామ్యం. వాళ్ల వంశవృక్షాన్ని విడమర్చి చెబుతూ తను ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు హసిత్ గోలి. అయితే ఇలా ‘విడమర్చి’ చెప్పే ప్రయత్నంలో ప్రేక్షకుడ్ని గందరగోళానికి గురిచేశాడు. సెకండాఫ్ లో తను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. అయితే అప్పటికే ఆడియన్స్ సహనం పోతుంది.

“కొత్త కథ ఇది. సినిమా స్టార్ట్ అవ్వడమే వెరైటీ సెటప్ తో స్టార్ట్ అవుతుంది. సినిమాలోకి సింక్ అవ్వడానికి ఓ 20 నిమిషాలు పడుతుంది. అక్కడ్నుంచి అంతా వినోదమే.” ప్రమోషన్స్ లో శ్రీవిష్ణు ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ నిజమే. ఆ సెటప్ లోకి సింక్ అవ్వడానికి టైమ్ పడుతుంది. కాకపోతే శ్రీవిష్ణు చెప్పినట్టు 20 నిమిషాలు సరిపోలేదు. సింక్ అయ్యేసరికి ఇంటర్వెల్ కార్డ్ పడింది. అంతంతమాత్రమే వినోదం అందింది.

వరుసపెట్టి పాత్రలు ఒకదానివెంట ఒకటి వచ్చేస్తుంటాయి. ఒక్కో పాత్ర ఒక్కో వెర్షన్ చెబుతుంది. మధ్యలో వంశం, ఆస్తి, పలక ఇలా చాలా ఎలిమెంట్స్ వస్తుంటాయి. ఆ డాట్స్ కలపడానికి మన మెదడుకు పని చెప్పాల్సి ఉంటుంది. అలా మొదటి భాగం గందరగోళంగా అనిపిస్తుంది. సినిమా మొత్తం అర్థమయ్యేసరికి క్లయిమాక్స్ వస్తుంది. మధ్యలో శాపనార్థాల ఎపిసోడ్ స్పెషల్ ఎఫెక్ట్. సరదాసరదాగా చూసే చిత్రం కాదిది, బుర్ర పెట్టి చూడాలి.

ఇంటర్వెల్ కు ముందు ఉన్నంత గందరగోళం ఆ తర్వాత లేదు. నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. అసలైన విభూతి పాత్రను పరిచయం చేస్తూ, ఆ మనిషి (ట్రాన్స్ జెండర్ పాత్ర) బ్యాక్ గ్రౌండ్ చెబుతూ, మొదటి భాగంలో వేసిన ముడులన్నీ విప్పుకుంటూ వెళ్లాడు. సో.. సినిమాను చివరివరకు చూస్తే ఇంటర్వెల్ కు ముందున్న కన్ఫ్యూజన్, క్లైమాక్స్ కు వచ్చేసరికి ఉండదు. కాకపోతే ఈ క్రమంలో ప్రేక్షకుడు ఆశించిన వినోదాన్ని అందించడం మరిచిపోయాడు దర్శకుడు.

రాజరాజచోర కాంబినేషన్ నుంచి వచ్చిన సినిమా ఇది. అదే దర్శకుడు, అదే హీరో కలిసి, అదే బ్యానర్ పై సినిమా చేశారు. ఆశ్చర్యంగా శ్వాగ్ సినిమా ఇంటర్వెల్ లో కూడా రాజరాజచోర ఇంటర్వెల్ ఫార్మాట్ నే ఫాలో అయ్యాడు. రాజరాజచోర సినిమా కోసం ఎలాగైతే ఓ మంచి పాయింట్ ను ఎత్తుకున్నాడో, శ్వాగ్ లో కూడా అలాంటి మంచి పాయింట్ నే ఎంచుకున్నాడు దర్శకుడు. లింగ వివక్ష లేని సమాజం ప్రజాస్వామ్యానికి మంచిదని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ రాజరాజచోరలో ఉన్నంత కామెడీ శ్వాగ్ లో కనిపించదు. అదే మైనస్.

దీనికితోడు పాత్రల కన్ఫ్యూజన్ ఒకటి. భవభూతి, విభూతి, అనుభూతి, యయాతి.. ఇలా చాలా పాత్రలున్నాయి. వాటిలో 4 పాత్రల్ని స్వయంగా శ్రీవిష్ణు పోషించాడు. దీనికి తోడు మరో 4-5 గెటప్పులు కూడా. కథ ప్రకారం అన్ని పాత్రల్ని ఇతడే పోషించాలి, తప్పదు. కాకపోతే అందులో కూసింత కామెడీ పెడితే బాగుండేది. మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో విభూతి పాత్ర వచ్చిన తర్వాత కామెడీ పూర్తిగా మరుగునపడిపోతుంది. నిజానికి ఇలాంటి ఓ ట్రాన్స్ జెండర్ పాత్రతో సందేశం ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో రాఘవ లారెన్స్ చేసిన ఓ సినిమాలో శరత్ కుమార్ పాత్ర ఇంతకంటే మంచి సందేశం ఇచ్చింది. కాబట్టి ఇది కొత్తగా ఉందని ఫీలవ్వలేం.

సినిమా మొత్తానికి భవభూతి పాత్ర హైలెట్. ఇది 2 షేడ్స్ లో సాగుతుంది. ఒకటి పోలీస్ పాత్రలో భర్తగా, మరొకటి రిటైర్మెంట్ కు దగ్గరైన వయసుమళ్లిన షేడ్.. ఈ రెండు షేడ్స్ లో శ్రీవిష్ణు మెప్పించాడు. సూపర్ హిట్ సినిమా పాటల్ని అతడు మాటల్లా చెబుతుంటే నవ్వొస్తుంది. వీటితో పాటు మిగతా పాత్రల్లో కూడా శ్రీవిష్ణు ది బెస్ట్ ఇచ్చాడు. నటనాపరంగా అతడి కెరీర్ లో ఇది ది బెస్ట్ మూవీ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

రెండేసి పాత్రల్లో రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్ తమ పరిథి మేరకు నటించారు. అయితే రీతూ వర్మ పాత్రకు తరాల మధ్య సంబంధాన్ని దర్శకుడు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు.

దక్ష పాత్ర కూడా అలాంటిదే. గోపరాజు రమణ, రవిబాబు, శరణ్య, సునీల్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

శ్రీవిష్ణు-సునీల్ కాంబోలో దర్శకుడు మంచి కామెడీ ట్రాక్ రాసుకుంటే బాగుండేది. ఈ యాంగిల్ అతడు ఎందుకు మిస్సయ్యాడో..!

టెక్నికల్ గా చూసుకుంటే, వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎప్పట్లానే సాంగ్స్ విషయంలో ఈ సంగీత దర్శకుడు ఫెయిలయ్యాడు.

సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు హసిత్ గోలి కొత్త కథ చెప్పే ప్రయత్నం చేశాడు కానీ అతడు రాసుకున్న స్క్రీన్ ప్లే అంత ఆసక్తిగా సాగలేదు. లాజిక్స్ గురించైతే అస్సలు ఆలోచించకూడదు. అందుకే ఎడిటింగ్ కూడా ఆకట్టుకోదు. సీన్లు రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.

పాత్రలు ఎక్కువైపోవడం, వాటి మధ్య ఎమోషన్స్ పండకపోవడం, కామెడీ లేకపోవడం శ్వాగ్ సినిమా ప్రధాన లోపాలు. మరీ ముఖ్యంగా రాజరాజ చోర సినిమాలో ఉన్నది, శ్వాగ్ లో మిస్సయింది ఎమోషన్ పండకపోవడమే. శ్రీవిష్ణు గెటప్స్, అతడి నటన కోసం ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. కామెడీ ఆశిస్తే మాత్రం భంగపాటు తప్పదు.

బాటమ్ లైన్ – కన్ఫ్యూజన్ తో ‘సాగిన’ శ్వాగ్

10 Replies to “Swag Review: మూవీ రివ్యూ: శ్వాగ్”

  1. రివ్యూ మాత్రం… సినిమా అర్ధం కాక ప్రేక్షకులు ‘భాగ్’ అన్నట్టుంది

  2. యే సీన్మా హాల్లో టిక్కెట్టు కొని చూసి రాశారు, ఇది?

    రివ్యూ రాసేవాళ్ళు, ఇకనుండి టిక్కెట్టు రుజువు కూడా పెట్టాలి, నిజంగా చూసే రాసాము అని.

Comments are closed.