రాజకీయ పరిభాషలో స్వాముల సిగపట్లు…!

స్వామి అంటే ఇహం వదిలి అహం విడిచి దైవం వైపు చూడాలి. కానీ వర్తమానంలో చూస్తే స్వాములు ఆవేశానికి లోను అవుతున్నారు. కొన్ని సార్లు ఒక వైపే చూస్తున్నారు. ఆశ్రిత పక్షపాతం చూపిస్తున్నారు. దేశంలో…

స్వామి అంటే ఇహం వదిలి అహం విడిచి దైవం వైపు చూడాలి. కానీ వర్తమానంలో చూస్తే స్వాములు ఆవేశానికి లోను అవుతున్నారు. కొన్ని సార్లు ఒక వైపే చూస్తున్నారు. ఆశ్రిత పక్షపాతం చూపిస్తున్నారు. దేశంలో స్వాములు ఆధ్యాత్మికత వారి వ్యవహారాలు అన్నది మాట్లాడుకుంటే పెద్ద సబ్జెక్ట్. బీజేపీతోనే హిందూత్వం ముడిపెట్టే స్వాములు వచ్చిన తరువాత మెల్లగా రాజకీయ రంగు పడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో స్వాములు చాలా మంది ఉన్నారు. వారు ఎన్నో మంచి విషయాలే జనాలకు చెబుతున్నారు. కానీ వారు రాజకీయ పరిభాషలో పాలకుల మీద విమర్శలు చేయడంతోనే తేడా వస్తోంది. విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్రను గతంలో కాంగ్రెస్ సానుభూతిపరుడిగా ఇపుడు వైసీపీ వైపుగా కట్టేశారు.

అయితే స్వామీజీ వద్దకు తెలుగుదేశం నాయకులు కూడా చాలా మంది వస్తూంటారు. అయినా స్వామీజీ మీద ఆ ముద్ర వేశారు. సింహాచలం చందనోత్సవం వేళ స్వరూపానందేంద్ర ప్రభుత్వం మీద ఘాటుగానే విమర్శలు చేశారు. దాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా కూడా బాగా కవరేజి ఇచ్చి చూపించింది.

అయితే స్వామీజీ వైసీపీ ప్రభుత్వం మీద చేసిన విమర్శల మీద సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద విరుచుకుపడ్డారు. భక్తుల గురించి వారి బాధల గురించి స్వరూపానందేంద్ర మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం మీద హిందూ వ్యతిరేకత పెరుగుతోదని దాన్ని కప్పిపుచ్చేందుకే స్వామి డ్రామా ఆడుతున్నారని తీవ్రమైన వ్యాఖ్యలే శ్రీనివాసానంద చేశారు

వైసీపీ నేతలు ఆలయాల భూములు ఆక్రమించుకున్నపుడు స్వరూపానందేంద్ర ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. శ్రీనివాసానంద వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువగా చేస్తారు. ఇద్దరు స్వాములూ హిందూత్వం మీద ఆధ్యాత్మిక మీద మంచి మాటలే చెబుతున్నారు. ఈ సమయంలో వారి మధ్యన రాజకీయ విమర్శలు అవసరమా అని హిందూత్వ మీద అభిమానం ఉన్న వారి నుంచి వస్తున్న మాట. 

ఏ ప్రభుత్వం అయినా రాజకీయాలకు అతీతంగా మతాన్ని పరిరక్షించేలా స్వాముల వ్యవహార శైలి ఉండాలనే అంతా కోరుతున్నారు.