టీడీపీ కొత్తగా 7.. పవన్ సంసిద్ధత ఎంత?

తెలుగుదేశం పార్టీ పవన్ కల్యాణ్ తో సంప్రదింపులు చేయకుండా రెండు స్థానాలు ప్రకటించినందుకే.. పొత్తుల్లో పొరపొచ్చాలు పొడసూపాయి. ‘తాము కూడా’ అంటూ పవన్ రెండు సీట్లు ప్రకటించారు. మరి ఇరుపార్టీల మధ్య సీట్ల పంపకాలు…

తెలుగుదేశం పార్టీ పవన్ కల్యాణ్ తో సంప్రదింపులు చేయకుండా రెండు స్థానాలు ప్రకటించినందుకే.. పొత్తుల్లో పొరపొచ్చాలు పొడసూపాయి. ‘తాము కూడా’ అంటూ పవన్ రెండు సీట్లు ప్రకటించారు. మరి ఇరుపార్టీల మధ్య సీట్ల పంపకాలు తేలకుండా, పొత్తులు కొలిక్కి రాకుండా.. ఉభయులు కలిసి ఎలాంటి ప్రకటన చేయకుండానే.. తెలుగుదేశం పార్టీ మరో 7 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేసింది.

ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నారు. గుడివాడ అమర్నాధ్ డిమాండ్ చేసినట్లుగా ఏడుకు-ఏడు సీట్లు ప్రకటించే తెగువ పవన్ కు ఉండకపోవచ్చు. కనీసం ఏడుకు- రెండు అయినా ప్రకటించగల సంసిద్ధత ఆయనకు ఉందా? లేదా, ‘మేము కూడా సిద్ధం’ అని జగన్ కు కౌంటరుగా నాటకీయ ఫ్లెక్సిలు వేసి రోజులు గడపడమేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. వెంకటగిరి – కురుగండ్ల రామకృష్ణ, గూడూరు- పాశం సునీల్ కుమార్, ఆత్మకూరు- ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కావలి- కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు- పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లకు సీట్లు ప్రకటించారు.

నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి, ఇటీవలి పరిణామాల్లో తెలుగుదేశంలోకి ఫిరాయించిన వారిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లకు మాత్రమే టికెట్లు దక్కాయి. మేకపాటి చంద్రశేఖర రెడ్డికి చంద్రబాబునాయుడు హ్యాండ్ ఇచ్చినట్టే అనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.

ఆదివారం నాడు చంద్రబాబు- పవన్ కల్యాణ్ సీట్ల పంపకం గురించి తేల్చుకోవడానికి రెండు విడతలుగా సమావేశం అయ్యారు. చంద్రబాబు ఇంట్లో మధ్యాహ్నం లంచ్ మీటింగ్ పూర్తి చేసిన పవన్ కల్యాణ్ వెళ్లిపోయి.. రాత్రి మళ్లీ వచ్చి మరీ చర్చలు జరిపారు.

ఉభయులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ చర్చల్లో కొన్ని సీట్ల గురించి అవగాహన ఏర్పడి ఉండొచ్చు గానీ.. కనీసం నేతలిద్దరూ ఉమ్మడి ప్రకటన ఏదీ చేయకుండా.. చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించేయడం అనేది మంచి పద్ధతి కాదని జనసేన నాయకులు అంటున్నారు. ఇలా కోపం తెప్పించినందుకే జనసేనాని గతంలో రెండుసీట్లు ప్రకటించారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.