తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా అడ్డంగా బుక్కైంది. తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని టీడీపీ విమర్శలకు దిగింది. అయితే దొంగ ఓట్లకు సంబంధించి టీడీపీ ఓ వీడియోను తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది.
ఈ వీడియోలో ట్విస్ట్ ఏంటంటే… టీడీపీ ప్యానల్‌కే యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తుండడం. ఈ వీడియో చూసిన తిరుపతి వాసులు ఇదెక్కడి చోద్యం అంటూ ముక్కున వేలేసుకున్నారు. తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికలను వైఎస్సార్‌సీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటీ పడి ఇరు ప్యానళ్ల అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు.
నగరంలోని బైరాగిపట్టెడలోని ఎస్జీఎస్ ఆర్ట్స్ కాలేజీలో పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 57250 మంది ఓటర్లున్న టౌన్‌బ్యాంక్‌లో 12 డైరెక్టర్ల స్థానాలకు 45 మంది బరిలో నిలిచారు. ఎన్నిక సజావుగా సాగుతున్నట్టే కనిపించింది. అయితే మధ్యాహ్నం నుంచి టీడీపీ గొడవ ప్రారంభించింది. అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని కొన్ని వీడియోలు వెలుగు చూశాయి. తీరా చూస్తే ఆ వీడియోలో టీడీపీ ప్యానల్ అభ్యర్థులకు ఓట్లు యథేచ్ఛగా వేస్తున్నట్టుంది.
వైసీపీని బద్నాం చేసే క్రమంలో టీడీపీనే గబ్బు పట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఓ వీడియోని అధికారిక ట్విటర్‌లో షేర్ చేసే ముందు ఏది తమ ప్యానల్ బ్యాలెట్ పేపరో, ఏది కాదో కూడా తెలుసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోని చూస్తే టీడీపీనే యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడిందనే అభిప్రాయం కలుగుతోంది. సోషల్ మీడియాలో తోపు అని చెప్పుకునే టీడీపీకి ఎందుకీ దుస్థితి అని నెటిజన్లు తప్పు పడుతున్నారు.