ఏపీలో అత్యంత శక్తిమంతమైన ప్రాంతీయ పార్టీ వైసీపీ. 151 మంది ఎమ్మెల్యేలు, 31 మంది పార్లమెంట్ సభ్యులుండడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి పార్టీకి జాతీయ స్థాయిలో ఎంత విలువ ఉండాలి? అలాంటిది ఏమైనా వుందా? అంటే “అబ్బే” అని చెప్పక తప్పదు. ఒకవైపు ఎన్‌డీఏ ప్రభుత్వానికి అన్ని విషయాల్లోనూ అడిగినా, అడగక పోయినా వైసీపీ మద్దతు ఇస్తోంది. కానీ వైసీపీ కనబరిచే ప్రేమలో కనీసం పదో వంతైనా బీజేపీ చూపుతోందా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
జగన్‌పై కేసులను అడ్డు పెట్టుకుని బీజేపీ తన పబ్బం గడుపుకుంటోంది. అప్పులు తెచ్చుకోవడంలో కొంత మినహాయింపు ఇవ్వడం తప్ప, ఏపీకి కేంద్రం చేస్తున్నదేమీ లేదు. కానీ వైసీపీని బీజేపీ ప్రత్యర్థిగానే చూస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్‌ను చూసినట్టుగానే ఏపీ విషయానికి వచ్చే సరికి వైసీపీని కూడా ఆ రీతిలోనే జమ కడుతోంది. తెలంగాణలో బీజేపీని టీఆర్ఎస్ ప్రత్యర్థిగా భావిస్తోంది.
ప్రధాని మోదీ, బీజేపీపై ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధాని మోదీని గిల్లుతూనే వుంటానని కేసీఆర్ తేల్చి చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా అవసరమైతే జాతీయ పార్టీ పెడతానని కూడా కేసీఆర్ ప్రకటించారు. ఆయన జాతీయ పార్టీ స్థాపిస్తారా? లేదా? అనేది పక్కన పెడితే, మోదీకి వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరి తీసుకున్నారు.
కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది మాత్రం పూర్తి భిన్నమైన వైఖరి. కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉంటే ఏదైనా మంచి చేస్తుందనే ధోరణి నుంచి తనను ఏమీ చేయకుండా వుంటే అదే పదివేలని జగన్ భావిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనను కొట్టి పారేయలేం. ఉదాహరణకు తాజా రాజకీయ పరిస్థితుల్నే తీసుకుందాం.
ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అందుకు తగ్గట్టు ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అందరూ వెళ్లి రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌కు కూడా వైసీపీ మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ బీజేపీకి కనీస కృతజ్ఞత కూడా లేదు. టీఆర్ఎస్‌ను బద్నాం చేయాలని చూస్తున్నట్టే, వైసీపీకి నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
ఉదాహరణకు ఉచితాలు, అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో కుప్పకూలిన శ్రీలంక ఆర్థిక పరిస్థితులను చూసి అప్రమత్తం కావాలంటూ ఏపీ, తెలంగాణ, బిహార్ తదితర రాష్ట్రాలను కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించడాన్ని ఎలా చూడాలి? అసలే ఏపీలో ఆర్థిక పరిస్థితి శ్రీలంకను తలపించేలా ఉన్నాయని ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా కోడై కూస్తోంది. దానికి కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరికలు మరింత బలం కలిగించడం లేదా?
మరోవైపు జాతీయ ప్రాజెక్టు పోలవరం పూర్తి చేయడంలో జాప్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమని రాజ్యసభ వేదికగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవైపు పోలవరం నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా, మరోవైపు ఏపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నాలు వైసీపీకి ఆనందం కలిగిస్తాయా? ఏపీలో ఇలాంటి పరిణామాలు వైసీపీకి రాజకీయంగా నష్టం కలిగించవా?
అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితి వైసీపీది. ఏపీ బీజేపీ నేతలు విమర్శిస్తే… ఘాటుగా రియాక్ట్ అయ్యే వైసీపీ, కేంద్రం విషయంలో మాత్రం అతి జాగ్రత్తగా నోరు మూసుకుని వుంటుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీది ఇదే దుస్థితి. అయితే అధికారంలో వైసీపీ వుండడం వల్లే ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం. ఏపీలో బీజేపీకి కనీస మద్దతు లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కనీసం అరశాతం ఓట్లు కూడా రాలేదు.
కానీ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా…అధికార, ప్రతిపక్ష పార్టీలు జాతీయ పార్టీకి కొమ్ము కాయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న శాపం. బహుశా ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ దుస్థితిని కలలో కూడా ఊహించి వుండరు. అంతా మన ఖర్మ అని సరిపెట్టుకోవడం తప్ప ప్రజలుగా మనం ఏం చేయగలం?
సొదుం రమణ