టీడీపీ అభ్య‌ర్థిపై దాడి!

తూర్పు రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి కంచ‌ర్ల శ్రీ‌కాంత్ చౌద‌రిపై ఇవాళ దాడి జ‌రిగింది. తిరుప‌తిలో ఓటింగ్ స‌ర‌ళిని ప‌రిశీలించేందుకు ఆయ‌న న‌గ‌రంలోని సంజ‌య్‌గాంధీ కాల‌నీలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. దొంగ…

తూర్పు రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి కంచ‌ర్ల శ్రీ‌కాంత్ చౌద‌రిపై ఇవాళ దాడి జ‌రిగింది. తిరుప‌తిలో ఓటింగ్ స‌ర‌ళిని ప‌రిశీలించేందుకు ఆయ‌న న‌గ‌రంలోని సంజ‌య్‌గాంధీ కాల‌నీలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. దొంగ ఓట‌ర్ల‌నే అనుమానంతో కొంద‌రిపై ఆయ‌న ద‌బాయింపున‌కు దిగడంతో ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ఓట‌ర్ల‌ను బెదిరించ‌డం ఏంట‌ని టీడీపీ అభ్య‌ర్థిని వైసీపీ నేత‌లు నిల‌దీశారు.

ఈ సంద‌ర్భంగా దొంగ ఓట‌ర్ల‌తో రిగ్గింగ్‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న వాదించారు. టీడీపీ అభ్య‌ర్థి, స్థానిక వైసీపీ నేత‌ల మ‌ధ్య వాద‌న పెరిగింది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌కాంత్ చౌద‌రిపై వైసీపీ నేత‌లు దాడికి దిగిన‌ట్టు టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి టీడీపీ అభ్య‌ర్థి పోలింగ్ ప్ర‌క్రియ‌కు అడ్డు త‌గులుతున్నాడ‌ని అక్క‌డ కూడా చేయి చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.  ఇవాళ ఉద‌యం నుంచి ఆ పోలింగ్ కేంద్రం వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కున్నాయి.

పోలింగ్ మొద‌లైన కొంత సేప‌టికీ టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ కూడా ఇదే పోలింగ్ కేంద్రం వ‌ద్ద‌కు రావ‌డంతో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఒక ద‌శ‌లో టీడీపీ, వైసీపీ నేత‌లు ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకునే వాతావర‌ణం ఏర్ప‌డింది. 

పోలీసులు ఇరు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టి శాంతియుత వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్పారు. ప్ర‌శాంతంగా ఎన్నిక‌ల ప్ర‌క్రియ సాగుతుండ‌గా, మ‌రికొద్ది సేప‌ట్లో పోలింగ్ ముగుస్తుంద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో శ్రీ‌కాంత్ చౌద‌రి రాక‌తో మ‌రోసారి గొడ‌వ‌కు దారి తీసింది. శ్రీ‌కాంత్ చౌద‌రి దాడికి గురి కావ‌డంపై టీడీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.