ఆస్కార్ అవార్డ్ దక్కని వాళ్ల పరిస్థితేంటి?

ఆస్కార్ గెలిస్తే ఆ ఆనందమే వేరు. లైఫ్ టైమ్ క్రేజ్ వస్తుంది, కెమెరాలన్నీ క్లిక్ మంటాయి. ఇంటాబయట ఊహించని పాపులారిటీ. మరి ఆస్కార్ దక్కించుకోలేని సినీ ప్రముఖుల పరిస్థితేంటి? వాళ్లు చేతులు పిసుక్కోవడమేనా? మనసు…

ఆస్కార్ గెలిస్తే ఆ ఆనందమే వేరు. లైఫ్ టైమ్ క్రేజ్ వస్తుంది, కెమెరాలన్నీ క్లిక్ మంటాయి. ఇంటాబయట ఊహించని పాపులారిటీ. మరి ఆస్కార్ దక్కించుకోలేని సినీ ప్రముఖుల పరిస్థితేంటి? వాళ్లు చేతులు పిసుక్కోవడమేనా? మనసు నిండా బాధతో, ఖాళీ చేతులతో ఇంటికెళ్లడమేనా? అలాంటి వాళ్లకు కోటి రూపాయల ఓదార్పు ప్యాకేజీ అందిస్తోంది 'అకాడమీ'.

అవును.. ఆస్కార్ కు నామినేట్ అయినవాళ్లకు అవార్డుతో సంబంధం లేకుండా కోటి రూపాయల గిఫ్ట్ బ్యాగ్ కానుకగా అందుతుంది. ఇందులో చాలా రకాల బహుమతులు, సర్ ప్రైజులు ఉంటాయి. అవేంటో చూద్దాం..

ఆస్కార్ కు నామినేట్ అయిన వ్యక్తులందరికీ తలా లక్షా26వేల డాలర్ల (దాదాపు రూ.కోటి) విలువైన బ్యాగ్ అందుతుంది. బ్యాగ్ ఓపెన్ చేయగానే మంచి వాసనతో జపనీస్ మిల్క్ బ్రెడ్ కనిపిస్తుంది. ఇదేంటి రొట్టె అని తేలిగ్గా తీసేయొద్దు, దీని ధర 18 డాలర్లు. దీంతో పాటు 14 డాలర్ల ఖరీదు చేసే బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇందులో ఉంటుంది.

బ్యాగ్ లో తినే వస్తువులు ఈ రెండు మాత్రమే. మిగతా బహుమతుల విషయానికొస్తే.. ఇటలీకి చెందిన ఓ ప్రైవేట్ లైట్ హౌజ్ లో 8 మందితో కలిసి 3 రాత్రులు బసచేసే కూపన్లు ఉచితంగా అందిస్తున్నారు. కేవలం సెలబ్రిటీల కోసం మాత్రమే ఉపయోగించే అత్యంత ప్రైవేట్ లైట్ హౌజ్ ఇది. ఇటలీలోని ఓ ద్వీపంలో కొండ అంచున ఎత్తుగా ఉండే ప్రైవేట్ లైట్ హౌజ్ ఇది.

దీంతో పాటు.. కెనడాలోని 10 ఎకరాల ఖరీదైన సువిశాల ఎస్టేట్ లో స్టే చేసే అవకాశం కూడా కల్పిస్తారు. 40వేల డాలర్ల ఖరీదు చేసే ఈ వసతి, ఆస్కార్ నామినీస్ కు పూర్తిగా ఉచితం. సెవెన్ స్టార్ వసతుల్ని మించి ఇందులో సౌకర్యాలుంటాయి. ఇక్కడ కూడా 3 రాత్రులు బస చేయొచ్చు. ఇక ఆస్ట్రేలియాలో ఓ ప్లాట్ బహుమతిగా ఇస్తున్నారు.

వీటితో పాటు ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ కింద 25వేల డాలర్లు, కాస్మొటిక్ సర్జరీ కోసం మరో 41వేల డాలర్లు అందిస్తారు. కాస్మొటిక్ సర్జరీ కింద లైపో, హెయిర్ రీస్టొరేషన్, ఫేస్ లిఫ్ట్ లాంటి ఖరీదైన ట్రీట్ మెంట్స్ చేసుకోవచ్చు. ఇలా మొత్తంగా 60 బహుమతులతో కూడిన కోటి రూపాయల విలువైన బ్యాగ్ ను నామినీలకు అందిస్తారు.

అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. అన్ని విభాగాల్లో నామినేట్ అయిన వ్యక్తులకు ఈ గిఫ్ట్ బ్యాగులు దక్కవు. ప్రధాన కేటగిరీలకు చెందిన ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ సహాయనటి,  విభాగాల్లో నామినేట్ అయిన వ్యక్తులకు మాత్రమే ఈ బ్యాగులు అందుతాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మిగతా వాళ్లంతో ఖాళీ చేతులతో వెనుదిరగడమే.

లాస్ ఏంజెల్స్ కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ, 2002 నుంచి క్రమం తప్పకుండా ఈ గిఫ్ట్ బ్యాగ్స్ అందిస్తుంది. ఆస్కార్ అకాడమీకి, ఈ సంస్థకు ఎలాంటి సంబంధం లేదు.