2018లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేసినట్టుగానే, ఈ దఫా కూడా రిపీట్ చేస్తుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అప్పట్లో ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన టీడీపీ… బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. కర్నాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు భారీ మొత్తంలో ఆర్థిక వనరులను కూడా టీడీపీ సమకూర్చిందనే ఆరోపణలున్నాయి.
కర్నాటలో తెలుగు ప్రజానీకం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టీడీపీ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలంటూ, అంత వరకూ ఆ పార్టీకి అంటకాగిన టీడీపీ నేతలు విస్తృత ప్రచారం చేశారు. ముఖ్యంగా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడిగా అప్పట్లో ఓ వెలుగు వెలిగిన అశోక్బాబు (ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీ) నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నేతలు కర్నాటక వెళ్లి ప్రచారం చేశారు.
అలాగే మీడియా డిబేట్లలో పాల్గొని బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని కర్నాటక ప్రజానీకానికి పిలుపునివ్వడం తెలిసిందే. 2018లో ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు. హంగ్ ఏర్పడింది. బీజేపీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 37 సీట్లు సాధించిన జేడీఎస్ చివరికి 80 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసినవే. ప్రస్తుతం కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉంది.
మే 10న కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. గతంలో మాదిరే ఈ దఫా కూడా బీజేపీకి వ్యతిరేకంగా కర్నాటకలో టీడీపీ ప్రచారం చేస్తుందా? అనే చర్చకు తెరలేచింది. అంత ధైర్యం చేసే పరిస్థితి టీడీపీకి లేదనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే గతంలో బీజేపీకి వ్యతిరేకంగా పని చేయడం వల్లే ఏపీలో ఘోర ఓటమిని మూటకట్టుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు.