ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యక్తిగత ద్వేషాలు చోటు చేసుకున్నాయి. సీఎం వైఎస్ జగన్ – చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌ల మధ్య ప్రత్యర్థి రాజకీయాలకు బదులు శత్రుత్వ భావన చోటు చేసుకుంది. వైఎస్ జగన్ దెబ్బతో రాజకీయంతో పాటు ఆర్థికంగా తమ పునాదులు కదిలిపోయాయనేది వారి ఆవేదన, ఆగ్రహం. అందుకే జగన్‌ను గద్దె దించాలని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు.
ఈ విషయాల్ని కాసేపు పక్కన పెడదాం. జగన్‌లో టీడీపీ నేతలకు బాగా నచ్చే అంశాలు కూడా ఉన్నాయి. జగన్‌ను శత్రువుగా చూస్తున్నప్పటికీ, అతని నుంచి తమ నాయకుడు చంద్రబాబునాయుడు ఒక మంచి విషయాన్ని అలవరచుకోవాలనే భావన టీడీపీ నేతల్లో వుంది. టీడీపీ నేతలకు జగన్‌లో బాగా నచ్చే అంశం… నిర్మొహమాటం.
ఎన్నికల సీజన్‌లో జగన్‌లోని ఈ స్వభావమే వైసీపీకి రాజకీయంగా లాభం కలిగిస్తోందనే అభిప్రాయం టీడీపీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. రాజకీయ సమీకరణల రీత్యా ఎంత పెద్ద నాయకుడినైనా పక్కన పెట్టాల్సి వస్తే, జగన్ ఒక్క క్షణం కూడా ఆలోచించరని టీడీపీ నేతలు అంటున్నారు. ఉదాహరణకు గత ఎన్నికల్లో టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులరెడ్డిని వైసీపీలో చేర్చుకుని ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని జగన్ అనుకున్నారు.
అయితే అప్పటికి ఒంగోలు ఎంపీగా జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి కొనసాగేవారు. సిట్టింగ్ ఎంపీ, దగ్గరి బంధువైన వైవీని తప్పించాలంటే జగన్‌కు అంత సులువు కాదని అంతా అనుకున్నారు. కానీ జగన్ తాను అనుకున్నట్టే చేశారు. వైవీ సుబ్బారెడ్డిని తప్పించి, సిట్టింగ్ స్థానాన్ని మాగుంటకు ఇచ్చారు. ఆ తర్వాత వైవీ అలకబూని విదేశాలకు వెళ్లినా జగన్ అసలు పట్టించుకోలేదు.
అలాగే వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి, తిరిగి సొంతగూటికి చేరిన ప్రజాప్రతినిధుల విషయంలోనూ జగన్ గట్టిగానే ఉన్నారు. నాడు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, అదే నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి విషయంలోనూ జగన్ నిర్మొహమాటంగా ఉన్నారు. వాళ్లిద్దరూ వైసీపీలో చేరినప్పటికీ టికెట్లు మాత్రం ఇవ్వలేదు.
ప్రస్తుతానికి వస్తే కొంత మంది మంత్రులకు కూడా టికెట్లు ఇవ్వరనే వార్తలొస్తున్నాయి. గెలవరని తెలిసి, టికెట్లు ఇవ్వకూడదని అనుకుంటే మాత్రం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మొగ్గు చూపరు. ఇదే జగన్‌కు రాజకీయంగా కలిసొస్తోంది. కానీ చంద్రబాబు విషయానికి వస్తే ఏదైనా నిర్ణయానికి తీసుకోవాలంటే ముందూవెనుకా చాలా ఆలోచిస్తారు. పర్యవసానాలపై తర్జనభర్జన పడుతుంటారు.
ఒక్కోసారి మోహమాటానికి పోయి ఓడిపోయే అభ్యర్థులకే టికెట్లు ఇస్తుంటారు. ఉదాహరణకు నెల్లూరు జిల్లా సర్వేపల్లి సీటును సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి తప్ప మరొకరికి ఇవ్వలేరు. ఇప్పటికి సోమిరెడ్డి ఎన్నిసార్లు ఓడిపోయి వుంటారో చెప్పనవసరం లేదు. అలాగే యనమల రామకృష్ణుడి కుటుంబ విషయంలోనూ అంతే. యనమల కుటుంబానికి ప్రజాదరణ లేదని తెలిసినా, మళ్లీమళ్లీ వారికే తుని సీటును కట్టబెడుతున్నారనే ఆగ్రహం టీడీపీ నేతల్లో వుంది.
అలాగే మాజీ మంత్రులు జవహర్, నక్కా ఆనందబాబు, ఎన్ఎండీ ఫరూక్, బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరుల విషయంలో ప్రజాదరణ లేదని తెలిసినా, మొహమాటానికి పోయి ఓటమిని చేజేతులా కొని తెచ్చుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే జగన్ విషయానికి వస్తే గెలుపు తప్ప, వ్యక్తులు ముఖ్యం కాదని, నాయకులెవరైనా అట్లా వుంటేనే మనుగడ సాగిస్తారని టీడీపీ నేతలు చెబుతున్న మాట.