ఆయన దృష్టిలో పవన్ కల్యాణ్ కు 15 సీట్లేనా?

తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నది? ఏ పార్టీ అయినా సరే తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటుంది. ఇప్పుడు ఏపీలో ఉన్న రెండు పార్టీలు కూడా మొత్తం 175 స్థానాలు…

తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నది? ఏ పార్టీ అయినా సరే తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటుంది. ఇప్పుడు ఏపీలో ఉన్న రెండు పార్టీలు కూడా మొత్తం 175 స్థానాలు గెలుచుకుంటాం అనే చెబుతున్నాయి. జగన్ అదే మాట చెబుతున్నారు. 

చంద్రబాబునాయుడు తమ కూటమిని దృష్టిలో ఉంచుకుని.. మేం 175 గెలవబోతున్నాం అనే మాటనే చెబుతుంటారు. కానీ తాజాగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఒక కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సారథి అచ్చెన్నాయుడు చెబుతున్న మాటలను గమనిస్తే.. కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి.

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ 160 సీట్లలో విజయం సాధిస్తుందని అచ్చెన్నాయుడు అంటున్నారు. 160 వారు గెలుచుకుంటే.. మరి పాపం.. చంద్రబాబునాయుడు పల్లకీ మోయడానికి అత్యుత్సాహం కనబరుస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి? తెలుగుదేశాన్ని నమ్ముకుని, ఈసారి వారి భుజం ఆసరా తీసుకుని అయినా గుప్పెడు సీట్లు గెలవాలని కలగంటున్న పవన్ కల్యాణ్ కు తెదేపా ఎన్ని సీట్లు కేటాయించదలచుకుంది.. అనేది ప్రశ్నగా మిగులుతోంది.

చంద్రబాబు చెబుతున్నట్టు 175 వారే గెలుస్తారని అనుకుంటే గనుక.. అందులోంచి అచ్చెన్న చెబుతున్న 160 మినహాయిస్తే, ఇంక పవన్ కల్యాణ్ కు కేవలం 15 సీట్లు మాత్రమే కేటాయించడానికి తెదేపా సిద్ధంగా ఉన్నదన్నమాట. పవన్ కల్యాణ్ మాత్రం.. తన ప్రసంగాల్లో, పార్టీ మీటింగుల్లో కనీసం 30-40 మంది ఎమ్మెల్యేలైనా ఉంటే మనం సీఎం సీటు అడగొచ్చు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆ మాటల ద్వారా.. 40 సీట్ల వద్ద బేరాలాడడం ప్రారంభించి.. 30 సీట్లకు అంగీకరించే వాతావరణం కనిపిస్తోంది. 

ఇటువైపు అచ్చెన్నాయుడు మాటలను గమనిస్తే.. జనసేనకు 15 మించి ఇవ్వడం ఆయనకు ఇష్టం లేనట్టుంది. తొలినుంచి కూడా.. జనసేనకు 10 సీట్లు ఇవ్వడానికి మాత్రమే చంద్రబాబు సుముఖంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ‘పది సీట్లు ఇస్తే నేను ఒప్పుకుంటానా?’  అంటూ పవన్ కల్యాణ్ బహిరంగ వేదికల మీద ఆ పుకార్లను ఖండించారు కూడా. 

పది కాకపోతే.. పదిహేను సీట్లకు ఆయన రాజీపడతారా? అనే అనుమానం అచ్చెన్న మాటలను బట్టి కలుగుతోంది. ఆ పదిహేనులో పవన్ కల్యాణ్ ఎన్ని గెలుస్తారని అచ్చెన్న అభిప్రాయపడుతున్నారో లేదా, 160 తాము గెలిచేలాగైతే, ఓడిపోయే సీట్లను మాత్రం పవన్ మొహాన కొట్టి చేతులు దులుపుకుంటారో వేచిచూడాలి.