Advertisement

Advertisement


Home > Politics - Opinion

'అందరివాడు'గా రామ్ చరణ్ - 'అందనివాడు'గా ఎన్టీయార్

'అందరివాడు'గా రామ్ చరణ్ - 'అందనివాడు'గా ఎన్టీయార్

తాత నుంచి యథాతథంగా పేరుని, ఎంతో కొంత రూపాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్న ఏకైక మనవడు తారక్. అంతే కాదు, తాతగారి కాలంలో ఆయన, ఏయెన్నార్లే నెంబర్ వన్ స్థానాల్లో ఉండేవారు. ఇప్పుడు టాప్ లీగులో చాలామంది స్టార్లున్నారు. ఆ లీగులో ఎన్నో ఏళ్లుగా కొనసాగడం కూడా తాత వారసత్వమే అనుకోవాలి. తనకంటూ బలమైన ఫ్యాన్ ఫాలోయింగుంది. అయితే ఆ ఫాన్సులో ఎక్కువశాతం కేవలం తెదేపా సానుభూతిపరులు, కమ్మజాతీయులే ఉంటారనే అపోహ చాలాకాలం కొనసాగింది. ఇప్పుడది నిజం కాదని తేలిపోతోంది. ఈ విషయం చెప్పుకునే ముందు ఒక్కసారి  జూ. ఎన్టీయార్ గతాన్ని తలచుకుందాం. 

మొదటి నుంచి నందమూరి కుటుంబంలో సెకండ్ గ్రేడ్ సిటిజెన్ గా ట్రీట్ చేయబడ్డాడు తారక్. కారణాలు లోకవిదితం. 

బాల్యంలోనే క్లాసికల్ డ్యాన్సులో ప్రావీణ్యత పెంచుకోవడం వల్ల అతనిలో విపరీతమైన కాంఫిడెన్స్ పెరిగింది. బాలుడిగా ఉన్నప్పుడే రంగేసుకుని రాముడి వేషం వేయడం వల్ల నటనానురక్తి అతని మనసులో బలంగా నాటుకుంది. తాత, తండ్రి..ఇద్దరూ నటులే. జీన్స్ వల్ల కొంత, డ్యాన్స్ వల్ల కొంత, ఆసక్తి వల్ల ఇంకొంత అతను హీరో అయిపోయాడు. మొదట తెదేపా-కమ్మ వర్గీయులు భుజాన మోసారు. మొదట్లోనే కాదు చాలా ఏళ్లుగా అతనికి బ్రహ్మరథం పట్టారు. తమలో ఒకడిగా కలిపేసుకున్నారు. కానీ నందమూరి కుటుంబం కలుపుకుందా అంటే లేదనే చెప్పాలి. 

ఎన్నికలప్పుడు ప్రచారానికి పోయిన పెద్దాయన ఎన్టీయార్ గుర్తొచ్చినట్టే, జూనియర్ ఎన్టీయార్ కూడా గుర్తొచ్చేవాడు చంద్రబాబుకి. కానీ సూక్ష్మం తెలియక పిలుపు రాగానే తన కుటుంబం తనకు దగ్గరవుతోందని భ్రమ చెందాడు. ప్రచారం చేసిపెట్టాడు. యాక్సిడెంట్ పాలయ్యి చావు తప్పించుకుని బయటపడ్డాడు. ఎన్నికలైపోయాక మళ్లీ ఎన్టీయార్ మొహాన్ని చూడలేదు చంద్రబాబు. ఎప్పటిలాగే తనకి, తన తల్లికి అదే సెకండ్ గ్రేడ్ ట్రీట్మెంట్. ఇలాంటప్పుడే తనకి కళ్లు తెరుచుకున్నాయి. సత్యం బోధపడింది. "ఒహో...ఇదా వీళ్ల బుద్ధి" అని అర్ధం చేసుకున్నాడు. 

ఆశ్చర్యమేంటంటే తెదేపాకి జూనియర్ ఎన్టీయార్ అవసరం పడ్డాడు తప్ప జూనియర్ ఎన్టీయార్ కి తెదేపా అవసరం పడలేదు. 

ఆ మధ్యన తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు భార్యని ఏదో అంటే అది పెద్ద గొడవయ్యింది. ఆ సమయంలో నందమూరి కుటుంబమంతా ఒక చోట గుమికూడి, నారా భువనేశ్వరికి అండగా నిలిచి ప్రెస్సుని పిలిచి ఖండించారు. కానీ ఎన్టీయార్  మాత్రం వెంటనే స్పందించకుండా కాస్త నింపాదిగా ఒక వీడియో బైట్ విడుదల చేసాడు. అందులో తాను అవమానానికి గురి కాబడ్డ స్త్రీ యొక్క కుటుంబ సభ్యుడిగా మాట్లాడట్లేదని...అసలు ఏ స్త్రీకి అవమానం జరగకూడదని చెబుతున్నానని చెప్పాడు. అది నందమూరి అభిమానులకి అస్సలు మింగుడు పడలేదు. అదేమి పేలవమైన జనరలైజ్డ్ ఖండన అని విరుచుకుపడ్డారు. పైగా వల్లభనేని జూనియర్ ఎన్టీయార్ కి ఆప్తమిత్రుడు. ఈ సంఘటనప్పటి నుంచి ఎన్టీయార్ ని దూరం పెట్టేసింది హార్డ్ కోర్ తెదేపా కమ్మ వర్గం. 

ఈమధ్యన రాం చరణ్, ఎన్టీయార్ లలో "గ్లోబల్ స్టార్" బిరుదు విషయంలో సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఎన్టీయార్ కి ఏ మాత్రం వత్తాసు పలకలేదు తెదేపా కమ్మ వర్గం. అయినా అతనికంటూ ఉన్న బలమైన ఫ్యాన్స్ సపోర్ట్ ఇచ్చారు. కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియాలో పోలింగ్ నిర్వహిస్తే రామచరణ్ కి, ఎన్టీయార్ కి సమానంగా ఓట్లు పోలయ్యాయి. మొత్తానికి పీ.ఆర్ బలంతో రామచరణ్ ఆ టైటిల్ ని ప్రకటించేసుకున్నాడు. ఈ ఎపిసోడ్ లో ఎన్టీయార్ కి తెదేపా కమ్మ వర్గం సపోర్ట్ ఉంటే తప్ప అతనికి స్టార్డం ఉండదనేది నిజం కాదని తేట తెల్లమైపోయింది. 

ఇదిలా ఉంటే చంద్రబాబు నిర్వహించే బహిరంగసభల్లో జూనియర్ ఎన్టీయార్ జెండాలు పట్టుకున్న అభిమానులు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. పైగా పార్టీలోకి జూనియర్ ఎన్టీయార్  రావాలని నినాదాలు చేస్తూ ఉంటారు. అవన్నీ చూస్తూ, తన కొడుకు లోకేష్ ని తలచుకుంటూ విషణ్ణ వదనంతో నిలబడి చూస్తుంటాడు చంద్రబాబు. జూనియర్ ఎన్టీయార్ ప్రాభవం అలా ఉంది పార్టీలో. మొన్నటికి మొన్న రజనీకాంత్ వచ్చిన విజయవాడ సభలో కూడా జూనియర్ ఎన్టీయార్ ప్లకార్డుని పైకెత్తారు కొందరు అభిమానులు. అదీ జూనియర్ పవర్. 

దీనికి కాస్త ముందు తారకరత్న దశదినకర్మ సమయంలో ఎన్టీయార్-కళ్యాణ్ రాం లు ఇద్దరూ హాజరయ్యారు. బాలకృష్ణ తమ వైపుకు వస్తుంటే ఇద్దరూ లేచి నిలబడ్డారు. కానీ బాలకృష్ణ వాళ్ల పక్కనున్న ఎవరినో పలకరించి వెళ్లిపోయాడు తప్ప కనీసం ఐ కాంటాక్ట్ కూడా మెయింటేన్ చేయలేదు. ఇదంతా గమనించిన జూనియర్ ఎన్టీయార్ నొసట్లు చిట్లించాడు కూడా. 

ఈ నేపథ్యంలో హైద్రాబాదులో  "ఎన్టీయార్ శతజయంతి" ఉత్సవాలు. దానికి జూనియర్ ఎన్టీయార్ రాకపోవడం. ఆరా తీస్తే బాలకృష్ణ ఇతర హీరోలని పిలిచినట్టు ఫోన్లో తనని పిలవకపోవడం ఒక కారణమవ్వడం. మే 20 న తన పుట్టినరోజు కాబట్టి రాలేకపోతున్నాని జూనియర్ ఎన్టీయార్ ఒక సాకు చెప్పడం...ఈ వార్తలు చూస్తూనే ఉన్నాం. ఏతావాతా ఇక్కడ విషయం ఒక్కటే. జూనియర్ ఎన్టీయార్ కి బాలకృష్ణకి మధ్య సయోధ్య లేదు. ఎందుకంటే బాలయ్యకి కూడా ఇప్పుడు తన అల్లుడు లోకేష్ ముఖ్యం తప్ప అతనికి పోటీ రాగల సత్తా ఉన్న అన్న కొడుకు కాదు. అనుకే జనం దృష్టిలో ఆహ్వానం ఇచ్చినట్టె ఇచ్చి, ఏం చేస్తే అవమానం ఫీలయ్యి తానే రాకుండా ఉంటాడో ఆ పని చేసారు. మొత్తానికి జూనియర్ ఎన్టీయార్ రాలేదు. 

ఇప్పుడు విషయానికొస్తే, ఇదంతా ఇతని మంచికా చెడుకా? తాను ఆబ్సెంటైన చోట రామ చరణ్ వెళ్లిపోయి చంద్రబాబుని పొగిడేసి తెదేపా కమ్మజాతీయుల మన్ననలు పొందేసాడు. అలా అందరివాడుగా రామ చరణ్, అందనివాడుగా ఎన్టీయార్ కనిపిస్తున్నారు తెదేపా కమ్మ జనాలకి. దీనివల్ల జరిగే చెడు కన్నా మంచే ఎక్కువ. తెదేపా కమ్మజనాలకి దూరమైనా తక్కిన జనాలాకి అతను దగ్గరవుతాడు. వాళ్ల జనాభా చాలా ఎక్కువ. 

అయితే రానున్న రోజుల్లో ఎన్టీయార్ సినిమాల మీద తెదేపా సోషల్ మీడియా స్మియర్ కాంపైన్ నడుపుతుందనడంలో సందేహం లేదు. తమకి ఊడిగం చేస్తూ బతకని వాడు, పిలిచినప్పుడు రానివాడు, ఇండివిడువాలిటీ చూపించేవాడు ఆ వర్గానికి నచ్చరు. అందుకే టార్గెట్ చేస్తారు. దానికి తట్టుకుని నిలబడాలి ఎన్టీయార్ . ఆ కాంపైన్ల వల్ల సినిమా భవితవ్యాలేవీ తారుమారవ్వవు. సినిమాల్లో సత్తా ఉంటే ఎవరూ చెయ్యడ్డుపెట్టి ఆపలేరు. కానీ మానసికంగా కృంగదీసే పనులకు లొంగకుండా ఉంటే చాలు. 

ఏది ఏమైనా రాజకీయాలకు, రాజకీయనాయకుల పిలుపులకు దూరంగా ఉంటూ ఎన్టీయార్ తన ఇండివిడువాలిటీని కాపాడుకుంటున్నాడు. ఇలాగే ముందుకు వెళ్లితే మరింత బలపడతాడు. ఎన్టీయార్ కి ఇంకా చాలాభవిష్యత్తు ఉంది. వేదికెక్కి స్పీచిచ్చి మనసుని గెలుచుకోగల సత్తా మొత్తం నందమూరి కుటుంబంలో ఒక్క ఎన్టీయార్ కి తప్ప ఇంకెవ్వరికీ లేదు. కనుక ఆ ట్యాలెంటుకి ఓ రోజొస్తుంది. అప్పటివరకు అన్నీ గమనిస్తూ, నోట్ చేసుకుంటూ తన సినిమాలు తాను చేసుకోవడమే ఎన్టీయార్ చేయాల్సింది.

వి.బి.సి.చటర్జీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?